రష్యాలో భారీ భూకంపం

– రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 8.8గా నమోదు
– సునావిూ హెచ్చరికల జారీ
– రష్యా తీరంతోపాటు, జపాన్‌పైనా ప్రభావం

మాస్కో, జూలై 30: రష్యాలో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 8.8గా నమోదైంది. రష్యా తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పంతోపాటు జపాన్‌కు సునావిూ హెచ్చరికలు జారీ చేశారు. 3 విూటర్ల ఎత్తులో అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అమెరికాలో 2011లో సంభవించిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపం ఇది అని అధికారులు పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రష్యా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు భయాందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఇళ్లలోని క్యాబినెట్‌లు కూలిపోవడం, అద్దాలు విరిగిపోవడం, రోడ్లపై నిలిపిన కార్లు ఊగడం వంటి సిసి టివి ఫుటేజీలు విడుదల అయ్యాయి. ఈ నెలలో రష్యాలో అనేక భూకంపాలు సంభవించాయి. ఈనెల 20న రష్యాలో గంటలోపు ఐదు భూకంపాలు సంభవించాయి. భూకంప తీవ్రతకు పసిఫిక్‌ మహాసముద్ర తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. తూర్పు జపాన్‌లో రైల్వే సర్వీసులు నిలిపివేశారు. అమెరికా, ఫిలిపీన్స్‌, ఈక్విడార్‌లకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్‌ వరకు సముద్ర తీర ప్రాంతాల్లో అలర్ట్‌ జారీ చేశారు. రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంతోపాటు జపాన్‌కు కూడా సునావిూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే రష్యా, జపాన్‌లను సునావిూ తాకింది. జపాన్‌లోని నాలుగు పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హక్వరడో నుంచి దాదాపు 250 కి.విూ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టంపై ఎలాంటి సమాచారం లేదు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే. సునావిూ కారణంగా జపాన్‌లో 3 విూటర్ల వరకు అలలు ఎగసిపడుతున్నాయని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది.\

రష్యా సునావిూతో ప్రపంచ దేశాల అప్రమత్తం

రష్యాలోని భారీ భూకంపం సంభవించడంతో దీని ప్రభావంతో రష్యా, జపాన్‌ తీర ప్రాంతాలను సునావిూ తాకింది. పలుచోట్ల రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. వీటితోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునావిూ ముప్పు పొంచి ఉంది. అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునావిూ హెచ్చరిక జారీ అయింది. అలలు ఆరు అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. రాష్ట్రం మొత్తం సునావిూ సైరన్లు వినిపించాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలుతుండటంతో రోడ్లన్నీ కార్లతో బారులు తీరాయి. ఇక అలస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. ఇక జపాన్‌ ప్రభుత్వం తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. చైనాకు కూడా ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. సునావిూనే కాకుండా తుపాను ప్రమాదమూ ఉంది. దాంతో షాంఘైలోని 28 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్‌ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. రష్యాలో తూర్పు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున వచ్చిన భారీ భూకంపం కారణంగా దాంతోపాటు చుట్టుపక్కల దేశాలపై సునావిూ అలలు విరుచుకుపడ్డాయి. ఈ సునావిూ వల్ల ఆయా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. పలు నిర్మాణాలు దెబ్బతినగా భారీ తిమింగలాలు తీరంలోకి విసిరేసినట్లు పడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *