– అన్వేషణలకు శాస్త్రీయ వేదికగా నిలవనుంది
– రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
– ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల
కొత్తగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్ 1: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణ శాస్త్రీయ అభివృద్ధి ప్రయాణంలో ఓ కొత్త అధ్యాయానికి చరిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను సోమవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. సమన్వయంతో పనిచేసి మంగళవారం జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దేశంలోనే తొలి పూర్తిస్థాయి భూవిజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా అవతరించబోయే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పర్యవేక్షణలో పూర్తయ్యాయని వెల్లడిరచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యూనివర్సిటీ ప్రజలకు అంకితం కానుందన్నారు. కొత్తగూడెం ప్రాంతంలో విస్తారమైన బొగ్గు గనులు, ఖనిజ వనరులు, భూమి అంతర్గత నిర్మాణాలకు సంబంధించిన విశిష్టతల నేపథ్యంలో గతంలో స్థాపించిన మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజీని ఆధునిక భూవిజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయంగా మార్చడం రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఈ విద్యాసంస్థ ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులతోపాటు దేశమంతటా ఉన్న విద్యార్థులకు అత్యున్నత శాస్త్రీయ పరిశోధనా అవకాశాలను అందించనుందని స్పష్టం చేశారు. కోల్ మైన్స్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కొత్తగూడెం ప్రాంత ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూకంప విశ్లేషణ, వరదల అధ్యయనం, భూగర్భ జలాల పరిశోధన, ఖనిజ సంపద అన్వేషణకు శాస్త్రీయ వేదికగా విశ్వవిద్యాలయం నిలవనుందన్నారు. ఈ ప్రాంత భౌగోళిక ప్రత్యేకతలు, ఖనిజ సంపద, పర్యావరణ వైవిధ్యం భూవిజ్ఞాన రంగానికి అమూల్యమైన వనరులని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం భవిష్యత్ తరాలకు శాస్త్రీయ ప్రపంచంలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందన్నారు. భూగర్భ జలాలు, ఖనిజ సంపద నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ వంటి కీలక రంగాలకు నిపుణులను తీర్చిదిద్దడంలో ఈ వర్సిటీ కేంద్ర పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





