తెలంగాణ రైజింగ్‌ ‌డాక్యుమెంట్‌తో పెరిగిన ఇమేజ్‌

-‌ మూడు ఎకనమిక్‌ ‌జోన్లుగా రాష్ట్ర విభజన
– సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి
– మేడారం అభివృద్ధి కోసం రూ.251కోట్లు కేటాయింపు
– 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ
– ధాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1,780కోట్లు అందచేత
– గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26: భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అని గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో జాతీయ పతాకాన్ని ఆయ‌న ఎగుర‌వేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు పరేడ్ గ్రౌండ్‌లోని యుద్ధ స్మారకం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు నివాళులర్పించారు.ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్‌ ‌డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిందని, ఇది ‌హైదరాబాద్‌ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని చెప్పారు. రాష్ట్రాన్ని మూడు ఎకనమిక్‌ ‌జోన్లుగా విభజించి కీలక రంగాలకు ప్రత్యేకమైన జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మేడారం అభివృద్ధి కోసం రూ.251కోట్లు కేటాయించినట్లు గవర్నర్‌ ‌వెల్లడించారు. రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ ‌సరఫరా చేస్తున్నామని, గతేడాది బతుకమ్మ వేడుకలు గిన్నిస్‌ ‌బుక్‌లో చోటు సంపాదించాయని పేర్కొన్నారు. 26 లక్షల మంది రైతులకు రూ.2లక్షల వరకు రుణ మాఫీ చేసినట్లు, ధాన్యానికి బోనస్‌గా రైతులకు రూ.1,780కోట్లు అందజేశామని గవర్నర్‌ ‌తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. భూ వివాదాలను పరిష్కరించేందుకు భూభారతి చట్టం తీసుకొచ్చామని గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ అన్నారు. గ్రూప్‌-1, 2, 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని, ఇప్పటివరకు 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆయన తెలిపారు.

ఐటిఐలను అడ్వాన్స్ ‌టెక్నికల్‌ ‌సెంటర్లుగా మార్చి, తెలంగాణను గ్లోబల్‌ ‌స్కిల్‌ ‌హబ్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఇంటిగ్రేటెడ్‌ ‌స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్‌ ‌పేర్కొన్నారు. మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని గవర్నర్‌ ‌తెలిపారు. బ్యాంకుల ద్వారా మహిళలకు రూ.40 వేల కోట్లు సమకూర్చామని, మహిళలను పెట్రోల్‌ ‌బంక్‌లు, ఆర్టీసీ అద్దె బస్సులకు ఓనర్లుగా చేశామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని వెల్లడించారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం.. 27 ఎకరాల్లో రూ.2వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టిందని గవర్నర్‌ ‌తెలిపారు. 1.30 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని జిష్ణుదేవ్‌ ‌వర్మ చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని, చేనేత కార్మికులకు రూ.5లక్షల బీమా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, హిల్ట్ ‌పాలసీతో కాలుష్య పరిశ్రమలను సిటీ బయటకు తరలిస్తామని గవర్నర్‌ ‌వెల్లడించారు. వేడుకల్లో మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌ బాబు తదితరులు హాజరయ్యారు. అమెరికా పర్యటనలో ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హాజరుకాలేదు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి రిపబ్లిక్‌ ‌డే సందర్భంగా ప్రజలకు సోషల్‌ ‌మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత రాజ్యాంగం ఆమోదించబడిన ఈ రోజును దేశ చరిత్రలో ముఖ్యమైన సందర్భంగా అభివర్ణించారు.

 గవర్నర్‌ ఎట్‌ ‌హోంః హాజరైన మంత్రులు, ప్రముఖులు

రిపబ్లిక్‌ ‌డే సందర్భంగా లోక్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం జరిగింది. నేతలకు గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే ఏకే సింగ్‌, ‌స్పీకర్‌ ‌ప్రసాద్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌, ‌బీఆర్‌ఎస్‌, ‌భాజపా నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అవార్డస్ ‌ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను జిష్ణుదేవ్‌ ‌వర్మ ప్రదానం చేశారు. ఎట్‌ ‌హోం సందర్భంగా రాజ్‌భన్‌ ‌రోడ్డులో ట్రాఫిక్‌ ఆం‌క్షలు విధించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *