– రెండు దశల్లో ధర్నాలు
– 26 నెలలుగా పీఆర్సీ, ఐదు డిఏలు పెండింగ్
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎఫ్ నోటీస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించని పక్షంలో రెండు దశల పోరాట కార్యక్రమాన్ని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఆధ్వర్యంలో చేపడతామని రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డిలు హెచ్చరించారు. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి మంగళవారం ఇచ్చిన ధర్నా నోటీసులో పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలం నుండి, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 20 నెలల కాలంలో కూడా అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయ, ఉద్యోగుల జేఏసీ, యూఎస్పీసీ ఆధ్వర్యంలో అనేకమార్లు ప్రాతినిధ్యం చేసిన తరువాత మంత్రివర్గ ఉప సంఘం, ఉన్నతాధికారులతో కమిటీ వేసినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయ, ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ఇప్పటివరకు చెల్లించలేదని తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల వివిధ ఆర్థిక బిల్లులు కూడా సంవత్సరాల తరబడి పెండిరగ్ లో ఉంటున్నాయని తెలిపారు. పెండిరగ్ బిల్లుల పరిష్కారం కోసం నెలకు రూ.700 కోట్లు కేటాయిస్తామని చెప్పినప్పటికీ అవి ఏ మూలకూ సరిపోవడం లేదన్నారు. మొదటి పీఆర్‌సీ గడువు ముగిసి 26 నెలలు అయినప్పటికీ గత ప్రభుత్వం వేసిన పీఆర్‌సీ కమిషన్ సిఫార్సులను ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు తెప్పించుకుని దానిపై చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. అలాగే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు రావాల్సిన ఐదు డిఏలు పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల, పెన్షనర్ల, జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి చర్యలు చేపడతామని, నూతన హెల్త్ కార్డులు విడుదల చేస్తామని అనేకసార్లు హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని వారు తెలిపారు. ఈ ప్రధానమైన డిమాండ్లతోపాటు ఇంకా అనేక సమస్యలు పెండిరగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారంలో కూడా తీవ్రజాప్యం జరుగుతోందన్నారు. సమస్యలు దీర్ఘకాలం పెండిరగ్‌లో ఉండడం వల్ల వేలాదిమంది తీవ్రమైన ఆర్థిక సమస్యలతో, మానసిక వేదనతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సమస్యలతో అనేకమంది మరణించారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని డీటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యల సాధనకు రెండు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రాలలో ధర్నాలు, హైదరాబాదులో మహా ధర్నా డీటీఎఫ్ ఆధ్వర్యంలో చేపడతామని సోమయ్య, లింగారెడ్డిలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




