రెండు గంటలపాటు రైళ్ల రాకపోకలు బంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: ఓ యువతి రైలు పట్టాలపై కారు నడపడంతో అనేక రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకర్‌పల్లి వెళ్లే మార్గంలో జరిగింది. నాగులపల్లి గ్రామస్థులు యువతి కారును అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కారును పట్టాలపై వేగంగా నడుపుకుంటూ వెళ్లిపోయింది. దీంతో గ్రామస్థులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రైల్వే అధికారులు ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ల పైలట్లకు సమాచారం అందించారు. ఆ మార్గంలో నడిచే రైళ్లను నిలిపివేశారు. కొన్ని గంటలపాటు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ఈ నేపథ్యంలో రైళ్లలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఆమెపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పట్టాలపై కారు నిలిపిన యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారుతోపాటు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాగులపల్లి- శంకర్‌పల్లి మధ్య సుమారు ఏడు కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై ఆమె కారు నడిపిందన్నారు. ఆ యువతిని రవికా సోనికాగా పోలీసులు గుర్తించారు. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో అని, హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని, ఇటీవల ఆమెను విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు.





