– విప్ శ్రీనివాస్, ఇన్‌చార్జ్ కలెక్టర్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం
– నాణ్యతా రాహిత్యానికి నిదర్శనం
– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపణ
వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్ 25: వేములవాడలో ఒక డబుల్‌బెడ్ రూమ్ ఫ్లోర్ కూలిపోయిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. వివరాలిలావున్నాయి. వేములవాడ తిప్పాపూర్‌లో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించి నిలిపివేసిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ మంగళవారం పరిశీలించారు. ఈ క్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో వారు పరిశీలిస్తున్న సమయంలోనే ఒక ఇంటి ఫ్లోర్ (బేస్) ఒక్కసారిగా కూలిపోయింది. అదుపు తప్పి కింద పడి పోతున్న అది శ్రీనివాస్ ను పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు అధికారులు పట్టుకుని కాపాడారు.ఘటనా స్థలంలో ఒక్కసారిగా ఏర్పడ్డ అలజడి పరిశీలనకు వచ్చిన వారిని భయబ్రాంతులకు గురిచేసింది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నాణ్యత లేని పనులు చేసిందని తాము ఎన్నో సార్లు చెప్పిన సంగతి గుర్తుచేశారు. బేస్‌మెంట్ కూలిపోవడం నాసిరకం పనులకు నిదర్శనమని తీవ్ర స్థాయిలో విమర్శించారు.నిర్మాణాల నాణ్యతపై ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కమిషన్ల కోసం కట్టడాలను బలహీనంగా నిర్మించారు. వాళ్లు కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. ఇప్పుడు డబుల్ బెడ్‌రూం బేస్ కూడా కూలిపోయింది. ప్రజల కోసం కాదు. అక్రమార్జన కోసం పనులు చేశారు. తాము చెప్పిన ప్రతిదీ నేడు నిజమవుతోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.కేటీఆర్ చెల్లెలు కవిత చెప్పిన బంగారు తెలంగాణ మాటలు ఎక్కడ? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఇళ్లు మాత్రమే బంగారం అయ్యాయి. ఈ ఘటనపై ఆమె స్పందించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపిన ఆయన గత ప్రభుత్వం కట్టిన నాసిరకం నిర్మాణాలను తొలగించి, నాణ్యమైన పనులు చేస్తున్నాం. కూలిపోయిన బ్రిడ్జ్‌కు బదులుగా కొత్త బ్రిడ్జి పనులు చేపట్టామన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేసి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.’’గత ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులు ఇంకా ఎన్ని కూలుతాయో చూడాలి,’’ అని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మాణాల నాణ్యతారాహి త్యంపై తాము చేసిన ఆరోపణలు ఈరోజు నిజమయ్యాయని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




