భ్రమల్లో ఉండి పిచ్చి రాతలు రాయకండి

– కేబినెట్ అంటే ఉమ్మడి కుటుంబం వంటిది
– సీఎం దేశంలో లేరు కాబట్టి మంత్రులు నాతో చర్చించారు
– మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సమస్యలు వివరించారు
– సింగరేణిపై వివరణ ఇచ్చా.. ఇంకా అదే మాట్లాడితే ఎలా?
– మధిరలో మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి

మధిర, ప్రజాతంత్ర, జనవరి 28: ప్రజాభవన్‌లో తనతో మంత్రుల భేటీపై కొందరు పిచ్చి భ్రమల్లో ఉండి పిచ్చి రాతలు రాస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రులు డిప్యూటీ సీఎంను కలవకపోతే రాసే వారితో, చూపించే వారితో కలుస్తారా అని ప్రశ్నించారు. మధిరలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో లేరు కాబట్టి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశాన్ని ప్రజాభవ‌న్‌లో చర్చించామన్నారు. నాకు కొన్ని సూచనలు చేశారు.. మంత్రులు వారి సమస్యలు తెలియజేశారు.. ఆ విషయాలను నేను ముఖ్యమంత్రికి వివరించాను అని భట్టి చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్నిచోట్ల సమస్య ఎదురైనందున అందుకు సంబంధించిన మంత్రులు తనతో సమావేశమయ్యారని తెలిపారు. కేబినెట్ అంతా ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుంది.. రాష్ట్ర భవిష్యత్తు తమ అందరి లక్ష్యం అని స్పష్టం చేశారు. కాగా, సింగరేణి టెండర్ల అంశంలో పూర్తి ఆధారాలతో స్పష్టత ఇచ్చానంటూ ఇంకా అందులోనే తిరుగుతామంటే వాళ్ళ ఖర్మ అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్, ప్రజా ప్రభుత్వం.. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని నగరాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నదని, ప్రధానంగా ఆరోగ్యం, విద్యపైన దృష్టి కేంద్రీకరించి ముందుకెళ్తుతున్నదని తెలిపారు. తెలంగాణ పునాది, భవిష్యత్తు విద్యపైనే ఆధారపడి ఉందని కేబినెట్ భావిస్తున్నదన్నారు. గత ప్రభుత్వం పదేళ్లల్లో నిర్వహించని గ్రూప్-1 పరీక్షను ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే నిర్వహించడమే కాదు.. ఫలితాలు సైతం వెల్లడించి ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. అలాగే గ్రూప్-2 సైతం నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. తెలంగాణ తలరాత విద్యపైనే ఆధారపడి ఉందని నిర్ణయించి ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌ను ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తున్నామని చెప్పారు. నగరాల్లో మౌలిక సదుపాయాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసిందని, భారీ మొత్తంలో నిధులు ఖర్చు చేసిందని తెలిపారు. రేర్, క్యూర్, ప్యూర్ సమగ్ర విధానంతో రాష్ట్రాభివృద్ధి కోసం గ్లోబల్ సమ్మిట్‌లో విజన్-2047 డాక్యుమెంట్ విడుదల చేశామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు సమ్మిట్‌కు విచ్చేసి విజన్ డాక్యుమెంట్‌ను అభినందించారన్నారు.

అధిక మున్సిపాలిటీలు గెలుచుకుంటాdont li

దేశంలో ఎక్కడా లేని రీతిలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను అభివృద్ధి చేస్తున్నామంటూ ఆయా పథకాల గురించి భట్టి వివరించారు. హామీల్లో 90 శాతం అమలు చేశామన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అత్యధిక స్థానాలు గెలుపొందామో మున్సిపల్ ఎన్నికల్లో సైతం అధిక సంఖ్యలో స్థానాలు గెలుచుకొని రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామన్నారు. పార్టీకి ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా సేవ చేయాలని కోరుకునేవారు కొన్ని ప్రాంతాల్లో ఎక్కువమంది మున్సిపల్ టికెట్లను ఆశిస్తారు.. అందులో తప్పులేదు.. మంత్రులు, ఆ జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, పట్టణ ఇన్‌చార్జిలు సమష్టిగా ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉన్న అభ్యర్థులు, కాంగ్రెస్ భావజాలం తెలిసిన, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే వారిని గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలందరూ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని మున్సిపాలిటీలోని పార్టీ ఇన్‌చార్జిలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులకు సంబంధించిన అంశాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారని డిప్యూటీ సీఎం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *