స్వేచ్ఛ మరణాన్ని సంచలనం చేయొద్దు

– ఆమె కుమార్తె వీడియోలను యూట్యూబ్‌ల నుంచి తొలగించాలి
– మీడియా సంస్థల యాజమాన్యాలకు మహిళా జర్నలిస్టుల వినతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30 : జర్నలిస్టు స్వేచ్ఛ మరణాన్ని చాలా న్యూస్‌ ఛానెల్స్‌, యూట్యూబ్‌ ఛానల్స్‌, సోషల్‌ మీడియాలో సంచలనం చేసే ప్రయత్నం చేస్తున్నాయంటూ పలువురు మహిళా జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు మీడియా సంస్థల అధిపతులకు వారు ఒక లేఖ పంపారు. వ్యూస్‌ కోసం బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను రోడ్డు మీదకు లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది బాధితురాలికి ఏమాత్రం న్యాయం చేయదని పేర్కొన్నారు. ఏదైనా ఒక ఘటనను రిపోర్టు చేయడం వరకే జర్నలిస్టుల పని.. విచారణ కాదు.. దానికంటూ పోలీసులు, చట్టం ఉన్నాయి.. ఆ విషయాన్ని మనం ఎవ్వరం మర్చిపోకూడదు.. అలాగే ప్రెస్‌ కౌన్సిల్‌ నిబంధనలకనుగుణంగా మీడియా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని గుర్తు చేశారు. ఈ కేసులో మైనర్‌ విషయంలో అన్ని మీడియా ఛానెల్స్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా నిబంధనలను అతిక్రమించాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్‌ ఎస్టేట్‌గా ఉన్న మీడియా సెన్సేషన్‌ కోసం సెన్సిటివిటిని మరిచిపోతున్నదని మహిళా జర్నలిస్టులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు. స్వేచ్ఛ కుమార్తె ఫొటోలను, వీడియోలను వెంటనే తొలగించాలంటూ స్వేచ్ఛని మరోసారి చంపొద్దు.. అని విజ్ఞప్తి చేశారు. ఇది ఏ ఒక్క స్వేచ్ఛ కోసం కాదు.. చిన్నారుల విషయంలో, మహిళల విషయంలో మీడియా, డిజిటల్‌ మీడియా, సోషల్‌ మీడియా ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా గైడ్‌లైన్స్‌ పాటించాలి.. స్వేచ్ఛ మరణాన్ని రాజకీయం చెయ్యొద్దు.. స్వేచ్ఛ కేసును న్యాయబద్దంగా విచారణ జరిపి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని మహిళా జర్నలిస్టులుగా పోలీసులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *