ఎట్టకేలకు బయటపడ్డ బీజేపీ రంగు
పార్లమెంట్ సాక్షిగా రాజకీయ దుమారానికి దారితీసిన
సాక్షాత్తు హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు
‘అంబేడ్కర్, అంబేడ్కర్ అనడం వాళ్లకు ఇప్పుడో ఫ్యాషనైపోయింది. అన్నిసార్లు దైవనామ స్మరణ చేస్తే కనీసం ఏడు జన్మల దాకా స్వర్గమన్నా దక్కేది‘ అంటూ అంబేడ్కర్‌ను ప్రస్తావిస్తూ పార్లమెంట్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. రాజ్యాంగ వజ్రోత్సవాలపై రాజ్యసభలో రెండు రోజుల చర్చకు ఆయన బదులిచ్చారు. ఆ సందర్భంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అంబేడ్కర్ ప్రస్తావన తెచ్చారు. రాజ్యాంగం అంటే గౌరవం లేని పార్టీగా ముద్రపడిన భారతీయ జనతా పార్టీ రంగు ఎట్టకేలకు బయటపెట్టుకుంటోంది. అగ్రవర్ణ పార్టీగా ముద్రవేసుకున్న బీజేపీ పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తు హోం మంత్రి అమిత్ షా ఆరెస్సెస్ ప్రతినిధిగా మారిపోవడం విడ్డూరం కాక మరేమిటి? ఈ విషయంలో తాజాగా ప్రతిపక్షాలు మాటల తూటాలను సంధిస్తున్నాయి. అంబేడ్కర్‌ను పదేపదే అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌ది. ఇప్పుడు అంబేడ్కర్ పేరును వోటుబ్యాంకు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. అంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అయితే అమిత్ షా చేసిన ’అంబేడ్కర్ ధైవ నామస్మరణ’ పోలిక తీవ్ర విమర్శలకు దారితీసింది. జాతీయ రాజకీయాలు వాటిచుట్టే తిరిగాయి. దీనిని కాంగ్రెస్ అవకాశంగా మార్చుకుంది. రాజ్యాంగ నిర్మాతనే గాక దేశంలోని దళితులందరినీ అమిత్ షా తీవ్రంగా అవమానించారని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ మండిపడ్డాయి. ఆయన తక్షణం బహిరంగంగానూ, పార్లమెంటులోనూ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఓ అడుగు ముందుకేసి, షా తక్షణం రాజీనామా చేయాల్సిందే. లేదంటే ప్రధాని మోదీయే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అంబేడ్కర్ పట్ల మోదీ ఏమాత్రం గౌరవమున్నా ఈ పని చేయాలి అంటూ అల్టిమేటం జారీ చేశారు. అయితే, అందుకు భిన్నంగా ప్రధాని మోదీ తన ట్వీట్లలో హోం మంత్రిని వెనకేసుకొచ్చారు. ఎప్పటిలాగే కాంగ్రెస్ మీద మండిపడ్డారు. బీజేపీ అహంభావ ధోరణికి, అంబేడ్కర్‌పై వారికున్న ద్వేషానికి అమిత్ షా వ్యాఖ్యలు అద్దం పట్టాయని ఖర్గే మండిపడ్డారు. అంబేడ్కర్‌కు, రాజ్యాంగానికి ఏమాత్రం గౌరవం ఇవ్వొద్దని మనుస్మృతి సిద్దాంతాన్ని ఆచరించే బీజేపీ, ఆరెస్సెస్ నిర్ణయించుకున్నాయని ఆరోపించారు. మనుస్మృతికి చోటివ్వలేదంటూ రాజ్యాంగ ప్రతిని, అంబేడ్కర్ దిష్టి బొమ్మలను తగలబెట్టిన చరిత్ర బీజేపీది అని ఆరోపించారు. ఉభయ సభలు వాయిదా పడ్డాక పార్లమెంటు ప్రాంగణంలో విపక్షాలన్నీ అమిత్ షా వ్యాఖ్యలపై ఆందోళనకు దిగాయి. నేతలంతా నల్లజెండాలు, ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు తృణమూల్, ఆప్, ఆర్జేడీ, ఎస్పీ, శివసేన (యూబీటీ), వామపక్షాల నేతలు పాల్గొన్నారు. అమిత్ షా ఇలాగే మాట్లాడితే దేశమంతటా అగ్గి రాజుకుంటుందని ఖర్గే హెచ్చరించారు. కాగా, అమిషా వ్యాఖ్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు దిగింది కాంగ్రెస్. అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టింది. మరోవైపు, తన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయని అమిత్ షా వివరణ ఇచ్చారు.
అయితే ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేసి ఉంటే బీజేపీ నేతలు ఏ రేంజ్ లో రాజకీయ దుమారం లేపేవారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ రాహుల్ గాంధీ ఏ మాట్లాడినా అందులోంచి ఏదో ఒక మాటను పట్టుకుని నానా యాగీ చేసిన చరిత్ర బీజేపీకి లేదా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించిందే అనుకుందాం..ఇలాంటి రాజకీయాలు మొదలు పెట్టిందే బీజేపే అంటే కాదనగలమా? కనుక, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టే అవకాశం కోసమే చూస్తుంది. ఇప్పడు విపక్షాలు అదే పని చేస్తున్నాయి. అంబేడ్కర్ విషయంలో గతంలో నెహ్రూ హయాంలో ఏం జరిగిందో ఈ తరానికి తెలియకపోవొచ్చు. కానీ ప్రజలకు ఇప్పుడు జరుగుతున్నది మాత్రం స్ఫష్టంగా కనిపిస్తోంది. దీనిని బీజేపీ పెద్దలు గుర్తించాలి. ఏదేమైనా సున్నితమైన అంశంపై మాట్లాడే సందర్భంలో కేంద్రం హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తోంది.
సాధారణంగా విపక్షాల విమర్శలు, ఆరోపణలను ప్రధానీ, హోం మంత్రి ఏ మాత్రం పట్టించుకోరనే భావన ప్రజల్లో నెలకొని ఉంది. మణిపూర్ అల్లర్ల పైనే ప్రధాని చాలా కాలం వరకు స్పందించలేదు. మొక్కుడి స్టేట్ మెంట్ ఇచ్చి సరిపెట్టారు. అలాంటి మోదీ కూడా ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. ఇక అమిత్ షా ఏకంగా మీడియా ముందుకు వొచ్చి స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. దీనిని బట్టి విషయం ఎంత సున్నితమైనదో అర్థం చేసుకోవొచ్చు. ఎందుకంటే విషయం రాజ్యాంగ రచయిత కు సంబంధించినది కాబట్టి. దేశంలోని వర్గాలు పూజ్యనీయులుగా చూడాల్సిన వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇదే ఎజెండా. అంబేడ్కర్ ను అమిత్ షా అవమానించారని చెప్పి విమర్శలు చేయడం. దళిత నేతలతో ఉద్యమాలు చేయించడం. అయినా అమిత్ షా వంటి నేతకు అంబేడ్కర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే రాజకీయం ఎలా ఉంటుందో తెలియదా.. తెలిసి కూడా మాట్లాడతారా?
-కరిష్మా





