– తూప్రాన్ రూపురేఖలు మార్చింది కేసీఆర్
– ఇక్కడి నీటి కష్టాలు తీర్చిందీ ఆయనే
– నేడు గుంతల రోడ్డుకు డాంబర్ వేసే దిక్కులేదు
– ఆసుప్రతి ఉన్నా డాక్టర్లు లేరు.. రోగులను గాలికొదిలేశారు
– రేవంత్ బూతుల ముఖ్యమంత్రి
– తూప్రాన్ అభివృద్ధి బాధ్యత నాది
– బీఆర్ఎస్ నేత హరీష్‌రావు
తుఫ్రాన్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: తూప్రాన్ ప్రజల నీటికష్టాలు తీర్చింది కేసీఆర్ అని బీఆర్ ఎస్ నాయకుడు హరీష్‌రావు అన్నారు. తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లాపూర్ చౌరస్తా నుండి తూప్రాన్ బస్టాండ్ వరకు శనివారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు తూప్రాన్‌లో మంచినీళ్లు కావాలంటే మూడు రోజులకోసారి వచ్చేవి. గీతారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిందెలతో అడ్డంపడి నిరసన తెలిపేవాళ్లు. కానీ కేసీఆర్ వచ్చాక ప్రతి ఇంటికి నల్లా పెట్టి ఆడబిడ్డల నీళ్ల కష్టాలు తీర్చారు. తూప్రాన్‌ను మున్సిపాలిటీ చేసింది, ఆర్డీవో ఆఫీస్ తెచ్చింది, ఫోర్ లైన్ రోడ్లు వేసి హైవేలా మార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఆయన రాకముందు తూప్రాన్‌కు పిల్లనియ్యాలంటే నీళ్లు మోపిస్తారని భయపడేవాళ్లు. ఇప్పుడు తూప్రాన్‌కే పిల్లనియ్యాలన్నట్టు పరిస్థితి మారింది. పది లక్షలు లేని భూమిని కోటి రూపాయలు చేసింది కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధరలు ఆకాశానికి చేరాయి. తూప్రాన్‌లో కాంగ్రెస్ నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని ఆరోపించారు. నర్సారెడ్డి, మైనంపల్లి మధ్య ఆధిపత్యం కోసం ప్రజలను బలి చేస్తున్నారు. మీకు ఆధిపత్య రాజకీయాలు కావాలా? లేక అభివృద్ధి కావాలా? ఆలోచించండి. రెండేళ్ల నుంచి తూప్రాన్ అభివృద్ధిని అడ్డుకున్నారు. రోడ్లకు గుంతలు పడితే డాంబర్ వేసే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. 50 పడకల ఆసుపత్రిలో డాక్టర్లు లేక మెదక్, గజ్వేల్ కు పంపుతున్నారు. మహిళలకు రూ.2500 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశాడు. ఈ 26 నెలల్లో ఒక్కో అక్కకు, చెల్లెకు రూ.65,000 బాకీ పడ్డాడు. తులం బంగారం ఇస్తానని చెప్పి కల్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఆపుతున్నాడు. అవ్వతాతలకు, బీడీ కార్మికులకు, చేనేత, గీత కార్మికులకు, డయాలసిస్ పేషెంట్లకు రూ.2000 పెన్షన్ ఇచ్చి కడుపులో పెట్టుకుంది కేసీఆర్. రేవంత్ రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి ఇవ్వలేదు.కేసీఆర్ ఉన్నప్పుడు పంట పంటకు రైతుబంధు పడేది. కరోనా కష్టకాలంలో కూడా ఆపలేదు. రేవంత్ రెడ్డి రెండు రైతుబంధులు ఎగ్గొట్టాడు. అన్నీ బంద్ పెట్టి ప్రజలను గోస పెడుతున్నాడు. మనకు అన్నం పెట్టిన కేసీఆర్ ను మర్చిపోవద్దు. బీజేపీ వాళ్లు ఓట్ల కోసం గిరగిర తిరుగుతున్నారు. వాళ్లు తూప్రాన్‌కు ఏమైనా చేశారా? ఒక్క హాస్పిటల్ కట్టించారా? కల్యాణ లక్ష్మి ఇచ్చారా? రూ.15 లక్షలు వేస్తామని 12 ఏళ్లుగా మోసం చేస్తున్నారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు ఇవ్వలేదు. పువ్వు గుర్తుకు ఓటేసినా, ఓటును మోరీలో పారేసినా ఒక్కటే. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. ఇలాంటి బూతుల ముఖ్యమంత్రికి ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలి.ఐదేళ్ల కోసం కౌన్సిలర్లను గెలిపించండి. రెండేళ్ల తర్వాత వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే. తూప్రాన్ అభివృద్ధి బాధ్యత నాది. ఏ పని ఉన్నా నేను చేసి పెడతానని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





