వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దు

సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: వక్ఫ్‌ సవరణ చట్టం 2025పై దేశసర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్‌పై  వివరణ ఇచ్చేందుకు కేంద్రం వారం గడువు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది. వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై సుప్రీంకోర్టు స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025ను సవాల్‌ చేస్తూ 73 పిటిషన్లు నమోదు కాగా.. గురువారం వరుసగా రెండో రోజూ సుప్రీం కోర్టు వాదనలు విన్నది..  కొన్ని అంశాలతో ప్రాథమిక సమాధానం ఇవ్వడానికి కేంద్రం తరఫున  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వారం గడువు కోరారు.

తదుపరి విచారణ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపారు.   ఈ క్రమంలో.. వక్ఫ్‌ ఆస్తుల్లో ఎలాంటి మార్పు చేయొద్దని సీజేఐ నేతృత్వంలోని బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ‘‘వక్ఫ్‌ బోర్డులో నూతన నియామకాలు చేయొద్దు. వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లిమేతరులను సభ్యులుగా నియమించొద్దు. వక్ఫ్, వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై చేయొద్దు వక్ఫ్ ఆస్తులు, నియామకాలపై స్టేటస్ కో విధిస్తున్నాం. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలకు వారం రోజుల్లో సవివర రిప్లై దాఖలు చేయాలి. మరో ఐదు రోజుల్లో రిజైన్డర్ దాఖలు చేయాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *