ప్రభుత్వాలే వేర్వేరు! విధానాలు ఒక్కటే?

ఇటీవల సోషల్ మీడియా లో తెలుగు రాష్ట్రలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు,రెవంత్ రెడ్డి బొమ్మలు ప్రక్క ప్రక్కనే పెట్టి,విద్యా,వైద్యమే ఇక ప్రభుత్వాల ప్రాదాన్యత ? సమర్దించేవారు షేర్ చేయండి! అంటూ వేలాది పోస్టులు పెట్టారు.ఈపోస్టులు షేర్ చేసిన వారిలో ఇరువురి ముఖ్యమంత్రుల మద్దతు దారులు, అబిమానులు, కులాబిమానులు ఉన్నారు.ప్రాదాన్యతసరే!రెండు తెలుగు రాష్ట్రలలో ఎన్నో వాగ్దానాలతో అదికారంలోకి వేర్వేరు పార్టీలద్వారా వచ్చిన ఇరువురి ముఖ్యమంత్రుల ప్రాదాన్యత ఏడాది, ఏడాదిన్నర కాలంలోనే మారడం వెనుక ఆంతర్యం ఒక పట్టాన అర్థం కాలేదు?ఇరు తెలుగు రాష్ట్రలలో ప్రదానంగా కాంగ్రెస్, టిడిపి పార్టీలు ఆరు గ్యారంటీలతోనే అదికారంలోకి వచ్చారు. వచ్చిన ఏడాది లోనే చెరోలక్ష కోట్లుపైగానే అప్పుచేసినా ఆరు గ్యారంటీల అమలు అసాధ్యం గానే మారింది. గురుశిష్యులు ఇద్దరూ ఆయా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మాట్లాడిన నిరాశ, నిస్పృహ మాటలు ,సందర్భాలు వేర్వేరు కావచ్చు నేమో!కానీ,అర్థం ఒక్కటే!అంతరార్థం మాత్రం చేతులెత్తేసిన స్థితినే? బహుశా!విద్యా, వైద్యం సోషల్ మీడియా పోస్టు అంతరార్ధం ఇదే కావచ్చు నేమో!?

ఎన్.తిర్మల్.,(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త)  సెల్:9441864514, ఇమెయిల్: thirmal.1960@gmail.com

చిత్రంగా స్వతంత్రంగా కనిపించినా ఇరువురి తెలుగు ముఖ్యమంత్రులకు రాజకీయ గురువు మాత్రం మన ప్రధాని మోదీ నే..! ప్రజల అసంతృప్తి ప్రబలినప్పుడు తమ చేతిలో ఉన్న రాజ్యాంగ సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పడం,విచారణల పేరుతో వారిని కార్నర్ చేయడం,అవసరమైతే అరెస్టులు చేయడం, జైళ్ళలో వేయడం,వారి ప్రతీష్ట దెబ్బతీయడం మామూలు విషయమే! అది గుజరాత్ మోడల్ రాజకీయవిద్యనే! డైవర్టేషన్ పాలిటిక్స్ మామూలే? అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, గతప్రభుత్వ కాలంలో విశ్వాసనీయంగా పనిచేసిన అధికారులను , రిటైర్ అదికారులను అరెస్టులు చేయడంలాంటి సరికొత్త నిర్బంధ పద్దతులు అనుసరిస్తున్నారు. చట్టం లోని లొసుగులు ఉపయోగించుకొని కేసులపై కేసులు కడుతున్నారు.

అచ్చం దిల్లీ రాజకీయాన్ని ఆదర్శం తీసుకొని “లిక్కర్ కుంభకోణం” విచారణ జరుపుతున్నారు. చీప్ లిక్కర్ విచ్చలవిడి వినియోగం మాదిరిగా కేసుల తంతు తయారైంది. ఏ ప్రభుత్వం తదుపరి ఓడిపోయినా లిక్కర్ కేసు పేరుతో విచారణ ఇక ఓ రాజకీయతంతు కానుంది. పూర్తిగా ఇదే తరహాలో కాకపోయినా! తెలంగాణా లోకూడా పోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తంతు కాస్తా ముందు వెనుక అలాగే మారనుంది. ఇప్పుడు తెలంగాణా అధికారులు, రిటైర్డ్ అధికారులు ఇళ్ళలో ఏసిబి దాడులు, పోలీసు విచారణ తంతు కొనసాగుతోంది. అవసరం అయిన సందర్భంలో ప్రత్యార్థి రాజకీయ నాయకులను అందులోకి లాగనూ వచ్చు. ఇరు రాష్ట్రాలలో ఇదే తరహా కొనసాగే పక్షంలో భవిష్యత్తులో ప్రత్యర్థి పార్టీ అధికారంలోకి వస్తే తమ సంగతి ఏమిటని ఇప్పుడు అధికారంలో ఉన్న ఐఏయస్,ఐపియస్ అధికారులు లోలోపల ఆందోళన చెందుతూనే ఉన్నారు.

అధికారంలో ఉండగా అవినీతి కి పాల్పడని ఆధునిక రాజకీయ పక్షాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే !ఎన్నికల్లో పంచుతున్న నల్లడబ్బు ఎక్కడిది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానం గా “ఎలెక్టోరల్ బాండ్లు” అనబడే చట్టబద్ద అవినీతి ప్రక్రియప్రజల కళ్ళముందే కదలాడుతూ ఉంది. ఇంకా తాజా రాజకీయ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు, లోకేష్ లు కేంద్రంలో మోదీ , అమిత్ షా లను తరచు కలుస్తా ఉంటే, మన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏ తెలుగు ముఖ్యమంత్రి కూడా వెళ్ళ నన్ని సార్లు , రికార్డు స్థాయిలో దిల్లీ వెళ్లి వస్తున్నారు. అందులో అంతర్యం ఏమిటో ఆయనకు తప్ప మరొకరికి తెలియదు. ఇంకా ఉభయ తెలుగు రాష్ట్రం లలో మీడియా కూడా ప్రజలతో లేదు. స్వాతంత్ర్యం గానూ లేదు. పాలక,ప్రతిపక్షాలలో ఏదో ఒక రాజకీయ పక్షానికి కరపత్రం గానో,మౌత్ పీస్ గానో పనిచేస్తున్నాయి.

అంటకాగుతున్నాయి. ఇక చర్చా వేదికల సరళి ఆయా పార్టీల అధికార ప్రతినిధుల బేటీల్లాగే మారిపోయాయి. రాజకీయ పార్టీల కంటే ఓ అడుగు ముందుకేసి అసత్య ప్రచార బాకాలు గా మారిపోయాయి. ఇప్పుడు అదికారులు వరకు వచ్చిన కేసులు,జైళ్ళు తెలుగు రాష్ట్రంలలో భవిష్యత్తులో మీడియా వరకురావనే గ్యారంటీ ఏమీలేదు. ఇప్పటికే ఆసూచనలు మొదలయ్యాయి. మీడియా ప్రస్తుతం ఓ అడుగు ముందుకేసి “మాయాబజార్ సినిమా లో లక్మణ కుమారుడును ఊపిరి ఆడకుండా పొగిడిన వందిమాగాదులను”మరిపిస్తూంది. ఇక ఇప్పుడు ఈ స్థితి లో మీడియా పై దాడులు,నిర్భందాల గురించి ప్రజలు పెద్ద స్పందించిన దాఖలా కూడా కనపడడం లేదు. ఇక దాడుల పై ప్రశ్నించే నైతిక అర్హత కూడా ఉండకపోవచ్చునేమో? తెలంగాణా రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఓ మంత్రికి సంభందించిన మీడియా,పత్రిక తమకు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా కనిపించిన వివక్ష ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్నా మారలేదని ఆవేదన వ్యక్తం చేయడం అంటే,అది తెలంగాణా అసంత్రృప్తికి దర్పణం కాదా? అది ఏస్థాయి అసంత్రృప్తి? ప్రజలను ఆలోచనలో పడేస్తూ ఉంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర లలో భూసేకరణ విధానం లో కూడా పెద్ద గా తేడాలేదు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల లో భూములు ప్రమాదకర మైన పరిశ్రమలకు కేటాయించడాన్ని నిరసన మాత్రమే కాదు!ప్రజలు ప్రతిఘటిస్తూ ఉన్నారు. ఇక భూములు కేటాయింపు విషయంలో సారూప్యత కనిపిస్తుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో విశాఖ పట్నం లో ఓ కంపెనీ కి కోట్ల రూపాయల విలువైన భూములు అధికారపక్షం గజం రూపాయికే కట్టబెట్టిందనే ఆరోపణలు వచ్చాయి. తెలంగాణా లో కూడా గ్రామ పంచాయతీ భూములు “కార్భన హక్కులు”పేరుతో 2020లో ఒక లక్షరూపాయలు ఆర్థిక వనరులతో ఏర్పడిన “ఎకొలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ “అనబడే సంస్థకు 30ఏళ్ళ లీజు పేరుతో కట్టబెడుతారనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ భూములు పందేరం అనేది పట్టణాల్లోనే గతంలో కనిపించేది. ఇదే నిజం అయితే, ఇప్పుడు ఆజాడ్యం గ్రామాలు స్థాయికి విస్తరించి నట్లే..!

ప్రజల సంస్కృతికి పేటెంట్ అయిన గద్దర్ పేరుతో ఇచ్చిన అవార్డుల ఎంపిక కమిటీ లో మురళీమోహన్, జయసుధ లాంటి సమైక్య వాద సినీనటులు ఉండడం, ఎంపిక కూడా ఆంధ్రా మూలాలు ఉన్న సినిమా నటులకు ,ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబం కు చెందిన ఆంధ్రా లెజిస్లేటర్ బాలకృష్ణ లాంటి హీరోకు అవార్డులు ఇవ్వడం తెలంగాణా సాంస్కృతిక సంకరణ గా ప్రజలు భావిస్తున్నారు? ఇక గత కేసీఆర్ ప్రభుత్వం సినిమా రంగంలో తెలంగాణా యాస,భాషను అవమానపర్చారని గత పదేళ్ళుగా నంది అవార్డులు ఇవ్వ నిరాకరించింది. కొన్ని సాంప్రదాయాలు ఇష్టం ఉన్నా లేకున్నా ప్రస్థుత ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది. అయితే, అందుకు భిన్నంగా తమది కాని పదేళ్ళ కాలానికి సినిమా అవార్డులు గద్దర్ పేరుతో ఇవ్వడాన్ని తెలంగాణా ప్రజలు జీర్ణించుకోలేక పోయారు.

”చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న” విధంగా ఓ ఇరవై మంది తో కోదండరాం చైర్మన్ గా తెలంగాణా, సాంస్కృతిక సలహామండలి నియమించడంతో వ్యవహారం సమసిపోయింది అనుకుంటే పొరపాటే? ఇంకా ఇటీవల మత విద్వేషం పరోక్షంగా రెచ్చగొట్టేదిగా ఉన్న పవన్ కళ్యాణ్ “హరిహర వీరు మల్లు”సినిమా కు తెలంగాణా లో ప్రత్యేక వసూళ్లు,షో లకు పర్మిషన్ ఇవ్వడం తెలంగాణా లోఇప్పుడొక పెద్ద చర్చ..! గతంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘పుష్ప’ రిలీజ్ సందర్భంగా ఓ బాలుడు కోమాలోకి వెళ్లిన సంఘటనలో తెలంగాణా లో ఇక ఎలాంటి సినిమా లకు పర్మిషన్ ఇవ్వమని సాక్షాత్తు తెలంగాణా అసెంబ్లీ లో ప్రకటించారు. ఆ ఓట్టుతీసి గట్టున పెట్టే అంత రాజకీయ మార్పులు ఇప్పుడు ఏమివచ్చాయో ఆయనే చెప్పాలి.

తెలంగాణా లో బిజేపి, టిడిపి,జనసేన పోటీ చేస్తారనే నేపద్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఏ రాజకీయాలను బలోపేతం చేయడానికి? ఇక బనకచర్ల నీరు విషయంలోఓవైపు జరిగేది జరుగుతుంది, మరోవైపు డైలాగ్ డ్రామానే నడుస్తొంది. ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రల ను పరిపాలించే పార్టీల్లో,నాయకుల్లో భిన్నత్వం ఉన్నా పరిపాలనా విధానం లో మాత్రం పెద్ద తేడా కనపడడంలేదు,ఇద్దరిలో ప్రదానిమోదీ తో సారూప్యత కనిపిస్తుంది కాకుంటే కాస్తా కుడి ఎడమ..!అయితే ఇద్దరు ముఖ్యమంత్రులు మద్య మాత్రం “నోటుకువోటుకేసు”అనుబంధం ఉంది. వీరిద్దరికీ కేంద్రం లో మోదీ అవసరం మాత్రం ఉండనే ఉంది!?.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *