ప్రతి సోమవారం నిర్వహణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28: తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖలోని సమస్యల పరిష్కారార్థం ప్రత్యేక కార్యక్రమం “ధర్మవాణి” (Dharmavani Program) ని ఎండోమెంట్స్ డైరెక్టర్ హనుమంత రావు శనివారం ప్రారంభించారు. శాఖలోని ఎవరైనా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి డైరెక్టర్ కార్యాలయంలో. ఉద్యోగులు, అర్చకులు లేదా ఇతరులు ఎవరైనా సరే డైరెక్టర్ ను కలవవచ్చని తెలిపారు.
ఈ “ధర్మవాణి” కార్యక్రమంలొ ధర్మబద్ధమైన సమస్యలను తక్షణమే లేదా గరిష్టంగా వారం రోజులలో పరిష్కరిస్తామని తెలిపారు. శాఖ ప్రధాన కార్యాలయం, డీసీ, ఏసీ, ఈఓ కార్యాలయాల్లో చేయాల్సి ఉండి చేయని పనులు లేదా పెండింగ్‌లో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దరఖాస్తు పరిష్కారమైన తర్వాత సంబంధిత వ్యక్తులకు కార్యాలయం నుండి సమాచారం అందజేస్తామని డైరెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిష్కరించలేని సమస్యల విషయంలో ఎందుకు పరిష్కరించలేకపోయామో కూడా వివరంగా తెలియజేస్తామని తెలిపారు.





