– నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేసిన పి.జె.ఆర్
– చెరువుల్లో అక్రమ నిర్మాణాలనే హైడ్రా కూల్చివేసింది
– పి.జె.ఆర్. ఫ్లైఓవర్ ప్రారంభ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 28: హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చేందుకు పి.జనార్థన్ రెడ్డి ఎంతగానో కృషిచేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలో పి.జె.ఆర్. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం తర్వాత ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. పి.జె.ఆర్. చేసిన పోరాటాల వల్లనే హైదరాబాద్‌కు కృష్ణ, గోదావరి జలాలు వచ్చాయన్నారు. ఎప్పుడు పిలిచినా పలికే నేతగా పేరుపొందిన పిజెఆర్ ఇల్లు ఎప్పుడూ కోలాహలంగా, జనతా గ్యారేజీ మాదిరిగా వుండేదన్నారు. కేవలం ఆయన కృషితోనే గచ్చిబౌలికి హైటెక్ సిటీ మంజూరైందన్న సంగతిని గుర్తు చేశారు. హైటెక్ సిటీకి నాటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు దీన్ని మరోస్థాయికి తీసుకెళ్లారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచంలోని న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీపడుతున్నదన్నారు. ఎంతమంది అడ్డుపడినా తాము కొనసాగిస్తున్న యజ్ఞం ఆగిపోదన్నారు. రైజింగ్ తెలంగాణ-2047కు అందరూ కలిసి వస్తున్నారన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి కంచ గచ్చిబౌలిని అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడ కొత్త కంపెనీల ఏర్పాటుతో ఐదులక్షల ఉద్యోగాలొస్తాయన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఆటంకాలు తాత్కాలికమేనన్నారు.
తెలంగాణను మూడు లేయర్లుగా అభివృద్ధి చేస్తామన్నారు. వందరోజుల్లో కోర్ అర్బన్ రీజియన్‌కు సంబంధించని ప్రణాళికలు సిద్ధమవుతాయన్నారు. దిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాలనుంచి మనం చాలా నేర్చుకోవాలన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో పర్యావరణ పరిరక్షణ కార్య క్రమాన్ని చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే డీజిల్ వాహనాలను బయటకు పంపించి నగరంలో కేవలం మూడువేల విద్యుత్ బస్సులు మాత్రమే తిరిగేలా అనుమతిస్తామన్నారు. విద్యుత్ కార్లు, ఆటోలు వున్నవారికి పన్నులు లేకుండా చేస్తున్నామన్నారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చివేసిందన్నారు. బతుకమ్మ కుంటను భారాసా నాయకులు ఆక్రమించుకుంటే, కబ్జానుంచి విడిపించామన్నారు. ఫైనాన్షియల్ సిటీని అభివృద్ధి చేయడం వల్ల ఐదులక్షల ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌పై ఒత్తిడిని తొలగించేందుకే ఫ్యూచర్ సిటీ ప్రతిపానను ముందుకు తెచ్చామన్నారు. 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటవుతుందన్నారు. డీలిమిటేషన్‌లో భాగంగా శేరిలింగంపల్లి నాలుగు నియోజక వర్గాలుగా విభజితం కానున్నదన్నారు. ఈ సందర్భంగా పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి,ఇతర కుటుంబ సభ్యులు గచ్చిబౌలి ప్లైఓవర్ కు పీజేఆర్ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్,ఎంఎల్సీ లు అద్దంకి దయాకర్,బల్మూర్ వెంకట్ కూడా పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ,ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి,ఉన్నతాధికారులు. తదితరులు పాల్గొన్నారు.





