అభివృద్ధి, సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదు

– మీ నమ్మకాన్ని వమ్ము చేయడంలేదు
– పాలేరు నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి

ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 10: రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని పాలేరు నియోజకవర్గంలో ఎక్కడా తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నాం అని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో ఆయన శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్‌ పరిధిలోని విద్యానగర్‌లో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేటలో రూ.1.02 కోట్లతో అంతర్గత సీసీ రోడ్లు, బస్‌ షెల్టర్‌, జంక్షన్‌ అభివృద్ధి, కమ్యూనిటీ హాల్‌ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే నడిమితండాలో రూ.77.10 లక్షలు, గొల్లగూడెంలో రూ.37.20 లక్షలు, జలగం నగర్‌లో రూ.29.30 లక్షలు, బారుగూడెంలో రూ.24.27 లక్షలు, ఆటోనగర్‌లో రూ.17.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదవాడి కష్టాలను పట్టించుకోలేదని, రేషన్‌ కార్డులు అడిగితే మొహం చాటేశారని మండిపడ్డారు. పదేళ్లుగా కొత్త రేషన్‌ కార్డులే ఇవ్వకుండా దగా చేశారంటూ తమ ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ కార్డులు అందజేయడమే కాక దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. గతంలో హాస్టళ్లలో పేద పిల్లలకు సరైన తిండి పెట్టలేదని, తమ ప్రభుత్వం వచ్చాక డైట్‌ చార్జీలను 40 శాతం, కాస్మెటిక్‌ చార్జీలను ఏకంగా 200 శాతం పెంచి పేద విద్యార్థులకు అండగా నిలిచామని వివరించారు. సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఏప్రిల్‌ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని, ఈ ప్రక్రియ దఫాలవారీగా నిరంతరం కొనసాగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లోనూ ప్రజల దీవెనలు ఇలాగే కొనసాగాలని పొంగులేటి కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *