– మధిర అంటే నాకు ప్రాణం
– అమెరికా, హైదరాబాద్ స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పిస్తా
– అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ
– స్వచ్ఛ, సుందరమైన టౌన్ కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
– కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నాది
– మధిర పట్టణ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి
మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7: మధిర అంటే నాకు ప్రాణం.. మధిర కీర్తి ప్రతిష్టలను పెంచేందుకు భవిష్యత్ తరాలకు అందమైన, అద్భుతమైన పట్టణాన్ని అందించాలనేది నా బలమైన వాంఛ, కల అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మధిర మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం భారీ ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ప్రజలు నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిపించి దీవించి పంపారు.. ప్రతి సందర్భంలోనూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశానని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు మధిర అభివృద్ధికి దూరమైంది.. అయినా మీ బిడ్డగా నన్ను అక్కున చేర్చుకుని దీవించి అసెంబ్లీకి పంపారు.. మీ గొంతుకై రాష్ట్రవ్యాప్తంగా పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర చేసి ప్రజల అవసరాలు గుర్తించి ఈ రాష్ట్రంలోని సంపద, వనరులు పేదల కోసం వెచ్చిస్తామని వివరించి ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. మీరు గెలిపించి పంపితే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియతమ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అంతా కలిసి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక, విద్యుత్తు, ప్రణాళిక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు అప్పగించారని వివరించారు. ప్రతి నిమిషం మీ ప్రతినిధిగా హామీలు వడివడిగా అమలు చేస్తూ మధిర కీర్తిని, ప్రతిష్టను పెంచేందుకు ప్రతి నిమిషం ప్రయత్నిస్తున్నానని తెలిపారు. మరో 50 సంవత్సరాలు గుర్తుపెట్టుకునేలా మధిర పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలతో ముందుకు పోతున్నానన్నారు. దూర ప్రాంత ప్రజలు వచ్చి మధిరలో స్థిరపడితే నా జీవితం ధన్యమవుతుంది.. ఇక్కడ సకల సౌకర్యాలు ఉన్నాయన్న భావన కల్పించేందుకు కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు కూటమి అభ్యర్థులను గెలిపించండి అని పిలుపునిచ్చారు. మధిర పరిసర గ్రామాల కూలీలు, రైతులు ఇక్కడ స్థిరపడి తమ బిడ్డలను చదివించుకొని హైదరాబాద్ లేదా అమెరికాకు పంపాలని కలలు కంటున్నారు.. వారి కలలు నిజం చేసేందుకు విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్టు తెలిపారు. జూనియర్ కాలేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాం, డిగ్రీ కళాశాల భవన నిర్మాణం జరుగుతున్నది.. నైపుణ్యం పెంచుకునేందుకు ఐటిఐను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌గా మార్చామని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు వేగంగా చేయిస్తున్నట్టు తెలిపారు. అండర్ గ్రౌండ్ విద్యుత్తు సరఫరా వ్యవస్థను మంజూరు చేసి ముందుకు పోతున్నామని తెలిపారు. మధిర చెరువును టూరిజం ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నామన్నారు. వరద ముంపును ఎదుర్కొనేందుకు అంబేద్కర్ సెంటర్ నుంచి మడుపల్లి మధ్యలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో ఎంత పెద్ద వరద వచ్చినా పట్టణంలోకి చుక్క నీరు రాకుండా రాయపట్నం వద్ద మొదలుపెడితే రైల్వే బ్రిడ్జి వరకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. నగరం ప్రారంభంలో ఉన్న డంపింగ్ యార్డ్ ను తొలగిస్తామని, వైరా నది పరివాహక ప్రాంతం మొత్తం వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్ పార్క్ నిర్మించి కుటుంబాలతో హాయిగా గడిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఓ పక్క ఏరు.. మరోపక్క పెద్ద చెరువు.. మధిర పట్టణం విస్తరించే పరిస్థితి లేదు. పట్టణం విస్తరించకపోతే స్థిర నివాసాలు పెరగవు స్థిర నివాసాలు పెరగకపోతే వ్యాపారాలు జరగవు.. అందుకే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి నగరాన్ని విస్తరించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ చేసినట్టు తెలిపారు. పట్టణంలో కూడా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు.
అమెరికా, హైదరాబాదు తరహాలో అధునాతన రక్షణ, వైద్య సదుపాయాలకు సంబంధించిన అన్ని పనులు మంజూరు చేసుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. పట్టణం కళలు, కళాకారులకు పుట్టినిల్లు.. కళాకారుల కార్యక్రమాలు, మేధోపరమైన చర్చల కోసం మంచి ఆడిటోరియం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో మహిళలు ఆర్థిóకంగా ఎదిగేందుకు మెప్మా ద్వారా శిక్షణ ఇప్పించి రుణాలు ఇప్పించి పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తానని స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ పార్కులో ప్రత్యేకంగా వారికి స్థలాలు కేటాయించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ఆలోచన చేస్తున్నట్లు భట్టి తెలిపారు. పట్టణానికి సమీపంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేశామని, కొద్ది రోజుల్లో వివిధ చాంబర్ల నుంచి ప్రముఖులను పిలిపించి స్థానికంగా వ్యాపారులకు శిక్షణ ఇప్పిస్తానని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తానని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తాం.. స్థలం లేని వారికి జి ప్లస్ టు ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించి పంపండి మధిర పట్టణ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రముఖులతో డెవలప్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేసి ప్రతి అభివృద్ధి పనులు నాణ్యతను పరిశీలిస్తానన్నారు. మధిర మున్సిపాలిటీ రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా నిలవాలన్నారు. మధిర అభివృద్ధికి ఇది కావాలని అడగండి పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. టికెట్ కోసం పోటీపడి దక్కని వారు నిరాశపడవద్దు.. సమాజానికి సేవ చేసే అవకాశాన్ని తాను కల్పిస్తానని అన్నారు. పట్టణంలో ఎంవిఐ కార్యాలయం ఏర్పాటుకు రవాణా శాఖ మంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



