తుంగతుర్తికి దేవాదుల నీళ్లు

– రూ.1000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం
– ఎస్‌ఆర్‌ఎస్‌పి ఫేజ్‌-2కు దామోదర్‌ రెడ్డి పేరు 
– కాలువల లైనింగ్‌, మరమ్మతులకు చర్యలు
– మంత్రి కెప్టెన్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

సూర్యాపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 13: తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల నీరు అందించాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. అందుకుగాను రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్దమౌతున్నాయని వెల్లడిరచారు. సూర్యాపేట జిల్లా అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తానన్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఎస్సారెస్పీ నీటి సరఫరా క్రమబద్ధీకరణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నదన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కట్టిన రోజున దాని సామర్ధ్యం 112 టీఎంసీలు ఉండగా మట్టి,ఇసుక పేరుకుపోవడంతో 80 టీఎంసీలకు పడిపోవడంతో చివరివరకు నీరు అందడం లేదని చెప్పారు. దానికితోడు కాలువలు, లైనింగ్‌ దెబ్బతినడం కూడా నీటి సరఫరకు అంతరాయం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని అవాంతరాలను అధిగమించి సూర్యాపేటకు ఎస్సారెస్పీ నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. అందులో భాగంగానే ప్రాజెక్టులో పూడికతీత పనులకు ఉపక్రమించామని, తద్వారా నీటి సామర్ధ్యం పెంచాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని చెప్పారు. వాస్తవానికి జిల్లాకు ఎస్సారెస్పీ నీటిని రప్పించిన ఘనత దివంగత నేత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డిదేనని ఆయన కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దామోదర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన రక్తతర్పణం కార్యక్రమంలో తామందరం పాల్గొన్న విషయాన్ని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గుర్తు చేశారు. ఎస్సారెస్పీ నీటి కోసం దామోదర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు, జరిగాయన్నారు. అలాంటి మహానేత పేరు ఎస్సారెస్పీ ఫేజ్‌-2కు పెట్టాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో తాను చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. దామోదర్‌ రెడ్డి పేరు చరిత్రలో పదిలంగా నిలిచిపోయేలా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ మహానేత లేని లోటు పూడ్చలేనిదని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవడానికి, జిల్లా అభివృద్ధికి అందరి సహకారంతో నిరంతరం పని చేస్తామన్నారు. జిల్లా మీదుగా పోతున్న జాతీయ రహదారిని ఆరు లేన్‌లుగా విస్తరించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే నన్నారు. అదే క్రమంలో సూర్యాపేట జిల్లాకు రైలు మార్గం మంజూరైందని కూడా వెల్లడిరచారు. వానాకాలం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్దమైందని, అందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక సాగైన మూడు పంటలు రికార్డు సృష్టించాయన్నారు. చరిత్రలోనే ముందెన్నడూ లేని రీతిలో 148.3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి సాధించామన్నారు. 80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం రూ.24 వేల కోట్లు ఖర్చు చేయబోతోందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడిరచారు. సమావేశంలో పార్టీ పరిశీలకుడు సారత్‌ రౌత్‌, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతీ, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొప్పుల వేణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *