మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలు బయటపెట్టాలి..

  • సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విచారణ చేపట్టాలి
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16 : ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన చాలా తీవ్రమైనవని, అవి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.  మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వయంగా మంత్రే ఒప్పుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

రాష్ట్ర మంత్రులపై ఇటువంటి ఆరోపణలు వొస్తే ప్రభుత్వం విచారణ జరిపించాలని, మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్యలను తేలికగా తీసుకోకూడదని కిషన్ రెడ్డి చెప్పారు. అయితే కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా, మంత్రులు తీసుకున్న కమీషన్లపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన డిమాండ్ చేశారు. ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో, ఎప్పుడు తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలని, ప్రజల ముందుకు పూర్తి వివరాలు బయటపెట్టాలని అన్నారు. ఇలాంటి ఆరోపణలతో ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కమీషన్ ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, కేంద్రం నుండి విచారణ కోరేందుకు ప్రయత్నిస్తామని సూచించారు.

పహల్గాం ఉగ్ర దాడికి కౌంటర్‌గా ’ఆపరేషన్ సిందూర్’‌తో పాకిస్థాన్‌కు గట్టి జవాబు చెప్పామని అన్నారు. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలను నెలమట్టం చేశామని పేర్కొన్నారు. భారత్ రాఫెల్ విమానాలను ధ్వంనం చేశామంటూ.. దిక్కుతోచని స్థితిలో పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. పాక్ దాడులకు త్రివిధ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని కిషన్ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *