ఆయనకో న్యాయం.. పేదలకు మరో న్యాయమా అని సర్కారుకు ప్రశ్న
మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ దాడులను సహించం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు అల్టిమేటం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన్ కాలేజీ భవనాన్ని తక్షణమే కూల్చివేస్తారా లేదా?.. లేకుంటే ప్రజల పక్షాన ఆ పని తామే చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు సోమవారం ఒక ప్రకటనలో అల్టిమేటం చారీ చేశారు. పాతబస్తీ సల్కం చెరువు భూమిలో అక్బరుద్దీన్ ఒవైసీ కాలేజీ కట్టిన మాట వాస్తవమేనని, అయితే అందులో పదివేల మంది విద్యార్థులు చదువుకుంటున్నందున వారి జీవితాలను నాశనం చేయలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. మరి మూసీ పరివాహక ప్రాంతంలో, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో చెరువు శిఖం భూములని తెలియక స్థలాలు కొన్న పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్లను ఎందుకు కూలుస్తున్నరు.. వాళ్లు మనుషులు కారా.. వాళ్లవి జీవితాలు కావా? వాళ్లకు కుటుంబాలు లేవా? వాళ్ల జీవితాలను ఎందుకు రోడ్డు పాల్జేస్తున్నరు? అక్బరుద్దీన్ కాలేజీకి ఒక న్యాయం? పేదలకు మరో న్యాయమా? కాంగ్రెస్ మార్క్ ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా అని తాను ప్రశ్నిస్తున్నానన్నారు. అందరికీ ఒకటే న్యాయమైతే అక్బరుద్దీన్ కాలేజీ భవనాన్ని ఎందుకు కూల్చరు? గతేడాది నోటీసులిచ్చి గడువు పెట్టారు.. విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే కూల్చివేస్తే కాలేజీ యాజమాన్యం వేరే భవనం చూసుకునేది కదా? విద్యార్థులకు ప్రత్యామ్నాయ కాలేజీల్లో అవకాశం కల్పించ్సా ఉండగా ఇవేమీ చేయకుండా అక్బరుద్దీన్ చెరువులు, పేదల భూములు, ప్రభుత్వ భూములు కబ్జా చేసినా, దాదాగిరి చేసినా, ఆఖరకు కరెంట్ బిల్లులు కట్టకపోయినా, తీవ్రవాదులకు ఆశ్రయమిచ్చినా వాళ్లకు రక్షణ కల్పిస్తామంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నిస్తూ తక్షణమే అక్బరుద్దీన్ కాలేజీని కూల్చివేయాలి.. లేకుంటే బీజేపీ ఆ పనిచేస్తుందని అని రామచంద్రరావు చ్చరించారు.
మీడియాపై బీఆర్‌ఎస్ దాడులను సహించం
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ మూకలు దాడులకు తెగబడుతున్నాయని ఇప్పుడే పోలీసుల నుండి సమాచారం వచ్చిందన్నారు. వారు బరితెగించి వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా ప్రజలు తమను నమ్మడం లేదని గ్రహించి ఏం చేయాలో తెలవక అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లు మీడియా సంస్థలపై వారు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. మొన్న మహాన్యూస్‌పై దాడులు చేశారు.. నేడు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలపై దాడులు చేసేందుకు సిద్ధమైనరు అని అన్నారు. తక్షణమే మీడియా సంస్థలకు రక్షణ కల్పించాలని రామచంద్రరావు కోరారు. ఒకవేళ మీడియా సంస్థలు ఏదైనా తప్పుగా రాస్తే చట్టపరంగా, న్యాయపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేస్తామంటే ఊరుకోబోమన్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయాలకు తగిన రక్షణ కల్పించాలని బీజేపీ యువ మోర్చా నాయకులకు ఆదేశాలు జారీ చేశానన్నారు. మాది వాక్ స్వాతంత్య్రాన్ని గౌరవించే పార్టీ అని, 14 కోట్ల మంది కార్యకర్తలు, కోట్లాదిమంది నరేంద్రమోదీ అభిమానులు తలుచుకుంటే మీరు అడుగు కూడా బయటపెట్టలేరనే సంగతిని గుర్తుంచుకోవాలి అని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీని రామచంద్రరావు హెచ్చరించారు.





