“భారత ప్రజాస్వామానికి అత్యంత కీలకమైన పరీక్ష ఇక్కడే ఉంది. భారత పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాలలో పార్టీలూ, సిద్ధాంతాలూ, భావజాలాలూ, నిబద్ధతలూ, విధేయతలూ, కనీసం సిగ్గు ఎగ్గులూ ఏమీ లేవని, అధికార కాంక్ష, ప్రతిఫలాపేక్ష, లాభాపేక్ష, స్వార్థం, అవకాశవాదం మాత్రమే ఉన్నాయని దశాబ్దాలుగా రుజువవుతున్న విషయమే మళ్లీ ఒకసారి రుజువయ్యే మహత్తర అవకాశాన్ని తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు ఇస్తున్నాయి.”
సాదారణంగా ఒక వారం వారం శీర్షికలో ఒకే విషయం మీద వరుసగా రెండో వారం కూడా రాసే సందర్భం రాదు. కాని రాష్ట్రంలో పురపాలక సంస్థల ఎన్నికల వ్యవహారంలో ఎన్నికలకు ముందు రాసిన గత వారం శీర్షికకు కొనసాగింపుగా రాయవలసిన విషయాలు మరెన్నో తలెత్తాయి గనుక మళ్లీ ఒకసారి అదే రాయక తప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ సన్నాహాల గురించి, ఎన్నికలలో విపరీతంగా ప్రవహించిన ధన, మద్య, వస్తు ప్రలోభాల గురించి, హింస గురించి, పార్టీల సిద్ధాంతాలతో సంబంధం లేని అక్రమ పొత్తుల గురించి చర్చించి ఇదా ప్రజాస్వామ్యం అని గత వారం సందేహించాం. వారం గడిచే సరికి ఎన్నికలు అయిపోయాయి. ఆయా పార్టీల అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలుపు సాధించడం కూడా జరిగిపోయింది. అలా ఎంత అక్రమంగానైనా “ప్రజాభిమతం” పొంది, ఎన్నికైన “ప్రజా ప్రతినిధులు” తమ పురపాలక సంస్థల అధ్యక్షులను, ఉపాధ్యక్షులను ఎన్నుకునే మరొక ప్రక్రియ కూడా జరిగిపోయింది. అలా చైర్మన్లుగా, మేయర్లుగా ఎవరు ఎన్నికవుతారు అనే దాన్ని బట్టే ఆయా పురపాలక సంస్థలు ఏ పార్టీ చేతిలో ఉన్నాయనేది తేలుతుంది.
ఎన్నికల తొలి ఫలితాలు వచ్చినప్పటి నుంచీ ఏ పార్టీ ఎన్ని వార్డులు గెలుచుకుంది, ఎన్ని డివిజన్లు గెలుచుకుంది, అంటే ఎంత వోట్ల శాతం సంపాదించింది అని గణాంకాలు, వివరాలు, విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ గణాంకాల ఆధారంగా ప్రతి పార్టీ తమదే విజయమని, తమ ప్రత్యర్థికి అంకెల్లో ఎక్కువ స్థానాలు వచ్చినట్టు కనబడినా నైతికంగా ఓటమి పాలయినట్టేనని, అవతలి పార్టీ కుట్రాలకు పాల్పడిందని విశ్లేషణలు సాగిస్తున్నాయి. కార్పొరేటర్ల, డివిజన్ల లెక్క ప్రకారం చూసినప్పుడు 74 మునిసిపాలిటీలలో, నాలుగు కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ కు ఛైర్మన్, మేయర్ పదవులు దక్కే అవకాశం ఉందని తొలి అంచనాలు వచ్చాయి. అదే రకంగా బి ఆర్ ఎస్ కు 17 మునిసిపాలిటీలు, ఫార్వర్డ్ బ్లాక్ కు ఒక మునిసిపాలిటీ దక్కుతుందని, 24 మునిసిపాలిటీలలో, 3 కార్పొరేషన్లలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత లేదని తేలింది.
కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత ఉన్న 74 మునిసిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లు, బి ఆర్ ఎస్ కు స్పష్టమైన ఆధిక్యత ఉన్న 17 మునిసిపాలిటీలు సరే గాని ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యత లేని – హంగ్ – ఉన్న 24 మునిసిపాలిటీలలో, మూడు కార్పొరేషన్లలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ హంగ్ పురపాలక సంస్థలు మన ప్రజాస్వామ్యానికి గీటురాయిగా మారాయి. హంగ్ అంటే ఉదాహరణకు 34 స్థానాలు ఉన్న బెల్లంపల్లిలో ఎవరికీ 18 రాకపోవడం. అక్కడ కాంగ్రెస్ కు, బి ఆర్ ఎస్ కు చెరి 14 స్థానాలు వచ్చాయి. మరొక నలుగురి మద్దతు దొరికితే తప్ప అక్కడ ఏ పార్టీ అయినా అధికారాన్ని స్థాపించుకోవడం కుదరదు. అక్కడ బిజెపి ఒక స్థానాన్ని, ఇతరులు ఐదు స్థానాలను గెలుచుకున్నారు. ఈ ఆరుగురిలో నలుగురు అటు కాంగ్రెస్ కు గాని, ఇటు బి ఆర్ ఎస్ కు గాని ఎవరికి మద్దతు ప్రకటిస్తే వారికి బెల్లంపల్లి మునిసిపాలిటీ దక్కుతుంది.
“అంటే మొత్తం మీద వోటర్లు తమ “ప్రతినిధులు”గా ఎన్నుకున్న అభ్యర్థులలో అత్యధికులు వారం కింద ఏ పార్టీ పేరు చెప్పి, ఏ సిద్ధాంతాలు ప్రకటించి, ఎవరిని తిట్టి, ఎవరిని పొగిడి ఆ ప్రజల వోటు సంపాదించారో, అవన్నీ తలకిందులైపోయాయి. మరి అవన్నీ తలకిందులైనప్పుడు వారికి వేసిన వోటు మాత్రం యథాతథంగా ఎలా ఉంటుంది? వారు ఆ ప్రజలకు ఎలా ప్రతినిధులుగా మిగులుతారు? ఈ మౌలిక ప్రశ్నలు అడగడం ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిషేధం. ఎన్నికలు జరగడమే ప్రజాస్వామ్యానికి నిర్వచనంగా కుదించి, ఎన్ని అక్రమాలతో, ఎన్ని అవకతవకలతో, ఎంత తలకిందులుగా జరిగినా, అసలు ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనే ఉల్లంఘించినా ఇది ప్రజాస్వామ్యమే అని నమ్మిస్తూ ప్రజల మీద దశాబ్దాలుగా సాగుతున్న పెద్ద వంచనా నాటకం ఇది.”
కనీసం ఇక్కడ గెలుపు గీత దాటడానికి నాలుగు స్థానాలు కావాలనే స్థితి అయినా ఉంది. కాని ఇంకా విచిత్రంగా కేసముద్రం మునిసిపాలిటీలో ఉన్న 16 స్థానాలలో కాంగ్రెస్ 8 గెలుచుకోగా, బి ఆర్ ఎస్ 8 గెలుచుకుంది. ఏదో ఒక పార్టీ లోనుంచి ఎవరో ఒకరైనా అవతలివైపుకు దూకితే తప్ప అక్కడ ఛైర్మన్ ఎన్నిక పరిష్కారం కాదు. సహజంగా అధికారపార్టీకే అటువంటి అవతలి నుంచి లాగే అవకాశం ఉంటుంది.
ఇక కార్పొరేషన్లలో 60 స్థానాలున్న కొత్తగూడెంలో 31 ఎవరికీ రాలేదు సరిగదా, కాంగ్రెస్ కూ సిపిఐ కీ చెరి 22 వచ్చాయి. ఆ రెండు పార్టీలు స్వతంత్రంగా మేయర్ కావాలంటే 8 స్థానాలు గెలుకుకున్న బి ఆర్ ఎస్ నుంచి, చెరి ఒక స్థానం గెలుచుకున్న బిజెపి, సిపిఎం ల నుంచి, ఆరు స్థానాలు గెలుచుకున్న ఇతరుల నుంచి కలిపి తొమ్మిది మందిని గుంజుకోవాలి. లేదా వారిద్దరూ కలిసి ఒక ఒప్పందానికి రావాలి. నిజానికి పది రోజుల కిందటి స్థితి చూస్తే, ఈ కార్పొరేషన్ లో స్థానాల పంపిణీయే ప్రధాన వివాదం అయింది. మొత్తం రాష్ట్రంలోనే రెండు సంవత్సరాలుగా సాగుతున్న పొత్తును చెదరగొట్టుకున్న పార్టీలు అవి. అంటే నిన్న చెడగొట్టుకున్న పొత్తు నిస్సిగ్గుగా ఇవాళ కుదుర్చుకోవడానికి అధికార కాంక్ష తప్ప మరే పునాదీ లేదు.
ఇక నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 స్థానాలకు గాను 28 స్థానాలు, కరీంనగర్ కార్పొరేషన్ లో 66 స్థానాలకు గాను 30 స్థానాలు సంపాదించి, భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ లో మూడు, కరీంనగర్ లో నాలుగు తక్కువ పడిన స్థితికి చేరింది. కాంగ్రెస్, బి ఆర్ ఎస్, మజ్లిస్ వంటి పార్టీల నుంచో, ఇతరుల నుంచో లాక్కుని ఆ ఖాళీ పూరించుకోకుండా అత్యధిక స్థానాలు సంపాదించిన పార్టీగా కూడా బిజెపి ప్రతిపక్షంలో కూచోవలసిందే.
ఇక్కడ మరొక తిరకాసు కూడా ఉంది. ఈ పురపాలక సంస్థలలో గెలిచిన ప్రజా ప్రతినిధులు మాత్రమే కాక ఆ పురపాలక సంస్థ ఏ నియోజకవర్గంలో భాగమో ఆ నియోజకవర్గ శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు ఆ పురపాలక సంస్థలో ఎక్స్ అఫిషియో సభ్యులు అవుతారు. వారు స్థానికులుగా వోటర్ గా నమోదు చేసుకుని ఉండాలనే సాంకేతిక అంశం ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్న పార్టీ తలచుకుంటే ఈ ఎక్స్ అఫిషియో వోట్లను తారుమారు చేసి, తనకు అనుకూలత లేని పురపాలక సంస్థల్లో అనుకూలత తెచ్చుకోగలదు.
భారత ప్రజాస్వామానికి అత్యంత కీలకమైన పరీక్ష ఇక్కడే ఉంది. భారత పార్లమెంటరీ ఎన్నికల రాజకీయాలలో పార్టీలూ, సిద్ధాంతాలూ, భావజాలాలూ, నిబద్ధతలూ, విధేయతలూ, కనీసం సిగ్గు ఎగ్గులూ ఏమీ లేవని, అధికార కాంక్ష, ప్రతిఫలాపేక్ష, లాభాపేక్ష, స్వార్థం, అవకాశవాదం మాత్రమే ఉన్నాయని దశాబ్దాలుగా రుజువవుతున్న విషయమే మళ్లీ ఒకసారి రుజువయ్యే మహత్తర అవకాశాన్ని తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు ఇస్తున్నాయి.
ఇటువంటి స్థితిలో తమ వోటు అత్యంత ఖరీదైనదిగా, భవిష్యత్తును మార్చేదిగా, పార్టీల సౌభాగ్యాన్ని తారుమారు చేసేదిగా మారిందని గుర్తించిన అభ్యర్థులు కొండెక్కి కూచుంటారు. వారు కొండమీద కోతిని కోరినా, అధికారం స్థాపించుకోదలచుకున్న పార్టీ తెచ్చి ఇచ్చి ఆ వోటు సంపాదించుకోవాలనుకుంటుంది. దాన్ని బట్టి ఆ “ప్రజా ప్రతినిధి” కోతి కొమ్మచ్చి లాగా ఈ కొమ్మ మీది నుంచి ఆ కొమ్మ మీదికి దూకుతారు. ఈ కప్పల తక్కెడ రాజకీయాన్ని ప్రజాస్వామ్యం అనడం ప్రజాస్వామ్య భావనకే అపచారం. కప్పల తక్కెడ అనదలచుకోకపోతే హార్స్ ట్రేడింగ్ (గుర్రాల బేరం) అన్నవాళ్లూ ఉన్నారు. గుర్రాలు అనడమేమిటి, అవి గాడిదలయితే అని ఈసడించినవాళ్లూ ఉన్నారు. ఈ అవకాశవాదులను కప్పలతో, గుర్రాలతో, గాడిదలతో పోల్చి ఆ నోరులేని జీవులను అవమానించడం తగదు గాని, అసలు ఇంత విలువలు లేని, సైద్ధాంతిక నిబద్ధత లేని, ఎక్కడ డబ్బూ, అధికారమూ దొరికితే అటు విధేయత మార్చడానికి సిద్ధపడే “ప్రజా ప్రతినిధులను” ప్రజాస్వామ్య చిహ్నాలుగా చూడడమే తలకిందుల వ్యవహారం.
ఈ కప్పల తక్కెడ ప్రజాస్వామ్యాన్ని మరింత ప్రజాస్వామికంగా మార్చేందుకు తమ పార్టీ అభ్యర్థులు అవతలి తక్కెడ లోకి దూకకుండా నిర్బంధ శిబిరాల క్యాంపు రాజకీయాలు, ఫోన్లు లాక్కుని రిసార్టులలో నిర్బంధించి పెట్టి, సకల విలాసాలు కల్పించడం, బేరసారాలతో కౌన్సిలర్లను, కార్పొరేటర్లను కొని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు, అవతలి పార్టీ “ప్రజా ప్రతినిధులను” కిడ్నాప్ చేయడం, అడ్డుకోవడం, కొట్టడం, అధికారపార్టీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ పతిపక్ష “ప్రజా ప్రతినిధులను” అరెస్టు చేయించడం, వాళ్ల కదలికల మీద నిఘా పెట్టడం, ఇటువైపు వస్తే వైస్ ఛైర్మన్ పదవి ఇస్తాం, రెండు కోట్ల రూపాయలు ఇస్తాం, ఖరీదైన కారు ఇస్తాం, కాంట్రాక్టులు ఇప్పిస్తాం, వగైరా వగైరా “మర్యాదపూర్వకమైన, ప్రజాస్వామికమైన చర్యలు” తీసుకోవడంలో రాజకీయ పక్షాలన్నీ పోటీలు పడ్డాయి.
ఈ పరిణామాల వార్తలు చదువుతున్నవారికెవరికైనా ఇవి ప్రజాస్వామిక రాజకీయాలు అనడానికి సిగ్గనిపించడం లేదా? వీటిని “అనైతిక పొత్తులు” అని తాము అది సాధించలేకపోయిన రాజకీయ పార్టీలూ, ఆ రాజకీయపార్టీలకు కొమ్ము కాసే పత్రికలూ ఛానళ్లూ కూడ అంటున్నాయి. అసలు మన రాజకీయాల్లో నీతి అనేది మిగిలిందా? ఎన్నో మునిసిపాలిటీల్లో ఏ పార్టీ మరే పార్టీతో కలిసిపోయిందో, ఎవరు నిన్నటి దాకా శత్రువుగా భావించిన వారికి వోటు వేశారో, ఆ వోట్ల బదిలీకి ఎంతెంత ధనం, ఏయే పదవుల ఎరలూ, ఏ కాంట్రాక్టుల వాగ్దానాలూ పని చేశాయో బహుశా ఎప్పటికీ బైటపడకపోవచ్చు. నిన్నటిదాకా తిట్టి దిగబారపోసిన బి ఆర్ ఎస్ కు బిజెపి ఎంపీ వోటు వేశారు. బిజెపి ఒక మునిసిపాలిటీలో కాంగ్రెస్ తో, మరొక మునిసిపాలిటీలో బి ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకోవడానికి ఏమీ సిగ్గు పడలేదు. ఒకచోట బి ఆర్ ఎస్ తరఫున గెలిచిన “ప్రజా ప్రతినిధి”, కాంగ్రెస్ లోకి దూకి, బిజెపి మద్దతు తీసుకుని ఛైర్మన్ అయ్యారు.
ఈ హార్స్ ట్రేడింగ్ అంతా జరిగి సోమవారం ఎన్నికలు ముగిశాక చూస్తే, కాంగ్రెస్ గెలుచుకున్న మునిసిపాలిటీలు 74 నుంచి 92 కు ఎగబాకాయి. అంటే 18 మునిసిపాలిటీల్లో కచ్చితంగా అక్రమ పొత్తులు కుదిరాయన్నమాట. బి ఆర్ ఎస్ 18 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. బిజెపి, ఫార్వర్డ్ బ్లాక్ చెరి ఒక మునిసిపాలిటీని సంపాదించగా, స్వతంత్ర అభ్యర్థి ఒక మునిసిపాలిటీని గెలుచుకున్నారు. మూడు స్థానాలు ఇప్పటికి వాయిదా పడ్డాయి. హంగ్ అయిన మూడు కార్పొరేషన్లలో చాణక్యం నడిపిన కాంగ్రెస్ ఒప్పందంతో ఒకటి సిపిఐకి ఇచ్చి, రెండు తానే చేతపట్టుకుంది.
అంటే మొత్తం మీద వోటర్లు తమ “ప్రతినిధులు”గా ఎన్నుకున్న అభ్యర్థులలో అత్యధికులు వారం కింద ఏ పార్టీ పేరు చెప్పి, ఏ సిద్ధాంతాలు ప్రకటించి, ఎవరిని తిట్టి, ఎవరిని పొగిడి ఆ ప్రజల వోటు సంపాదించారో, అవన్నీ తలకిందులైపోయాయి. మరి అవన్నీ తలకిందులైనప్పుడు వారికి వేసిన వోటు మాత్రం యథాతథంగా ఎలా ఉంటుంది? వారు ఆ ప్రజలకు ఎలా ప్రతినిధులుగా మిగులుతారు? ఈ మౌలిక ప్రశ్నలు అడగడం ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నిషేధం. ఎన్నికలు జరగడమే ప్రజాస్వామ్యానికి నిర్వచనంగా కుదించి, ఎన్ని అక్రమాలతో, ఎన్ని అవకతవకలతో, ఎంత తలకిందులుగా జరిగినా, అసలు ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలనే ఉల్లంఘించినా ఇది ప్రజాస్వామ్యమే అని నమ్మిస్తూ ప్రజల మీద దశాబ్దాలుగా సాగుతున్న పెద్ద వంచనా నాటకం ఇది.
మొత్తం మీద చూస్తే అన్ని రాజకీయ పార్టీలూ, అందరు ప్రజా ప్రతినిధులూ, అధికార వర్గమూ, రాజ్యాంగబద్ధ ఎన్నికల కమిషన్లూ కలిసి ప్రజాస్వామ్యం అనే మాటను అపహాస్యం చేస్తున్నారు! అదీ ఏడున్నర దశాబ్దాల భారత పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం సాధించిన ఘన విజయం!





