వారసత్వం ఉన్న నేల, విద్యకు కేంద్రం కావాలి!

“తెలంగాణ రాష్ట్రంలో 28 విశ్వవిద్యాలయాలు ఉండగా, అందులో 17 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 3 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, 3 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదనంగా, ఇటీవల మరో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఆమోదించబడ్డాయి. ఈ ప్రైవెటు విశ్వవిద్యాలయాలలో ఎలాగు పేదవారికి విద్య అందించబడదు కాబట్టి, నిర్మల్ వంటి ప్రాంతాలలో విశ్వవిద్యాలయం నెలకొల్పడం వలన కేవలం నిర్మల్ జిల్లా వాసులకే కాకుండా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లా వాసులు సైతం అడ్మిషన్ పొందవచ్చు.”

Jayaprakash photo
జయప్రకాశ్ అంకం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ చరిత్ర కాంగ్రెస్

తెలంగాణ ఉత్తర భాగాన సాంస్కృతిక వైభవం, చారిత్రక వారసత్వం, విద్యా ప్రాధాన్యం కలిగిన నిర్మల్ జిల్లాలో విశ్వవిద్యాలయం స్థాపన కోసం స్థానిక ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు గత కొంత కాలంగా ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన నుండి బలమైన డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఏర్పడిన 33 జిల్లాలో నిర్మల్ జిల్లా ఒకటి. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత గల ప్రాంతంగా నిర్మల్ ఉండేది. ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతమైనప్పటికినీ నిర్మల్ అభివృద్ధి పథంలో నడిచింది. నిర్మల్ జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్లలో 18 రెవెన్యూ మండలాల సమాహారంగా, దాదాపు 24 గ్రామాలతో నిర్మల్ విశాలమైన జిల్లాగా అవతరించింది. ఇక్కడ నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 31 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉండగా, ప్రైవేటు రంగంలో మరెన్నో కళాశాలలు ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్ళవలసిన గత్యంతరం ఏర్పడింది. తీవ్రమైన ఆర్థికభారంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన అనేక నిరుపేద విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపడం పెద్ద సమస్యగా పరిణమించింది.

ఒక ప్రాంతంలో విశ్వవిద్యాలయ స్థాపన స్థానికులకు ఉన్నత విద్యను అందించడమే కాకుండా, సామాజిక చలనశీలతను, మరింత నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని పెంచడానికి దారితీస్తుంది. విశ్వవిద్యాలయాలు విభిన్నమైన వ్యక్తులను, మేధో మార్పిడిని తీసుకువస్తాయి. ఇవి మరింత శక్తివంతమైన చైతన్యసహిత సమాజాన్ని పెంపొందిస్తాయి. పరిశోధన అవకాశాలను మెరుగుపడి, నాణ్యమైన విద్యను తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది. ఉద్యోగ పరికల్పన మాత్రమే కాకుండా, అనేక మంది స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విశ్వవిద్యాలయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థలలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. చారిత్రక మూలాలు, సంస్కృతి వారసత్వం ఉన్న నిర్మల్ లో విశ్వవిద్యాలయం స్థాపిస్తే ఆ ప్రాంతం ఖ్యాతి పెరగడమే కాకుండా, అనేక అవకాశాలు స్థానికులకు లభిస్తాయి.

నిజానికి నిర్మల్ కు ఘనమైన చరిత్ర ఉంది. శతాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలిచిన ప్రాంతమిది. చరిత్ర పూర్వ కాలం నుండి ఇక్కడ మానవులు నివసించినట్లు తెలుస్తుంది, ప్లీస్టోసీన్ యుగం నాటి మానవ ఉనికికి ఈ ప్రాంతంలో అనేక ఆధారాలు లభ్యమయ్యాయి. నిర్మల్ చరిత్ర నర్మదా నదిలోయ దిగువ పురాతన శిలాయుగం అచెయులియన్ పరిశ్రమలకు సంబంధించిన ఆధారాలను అందించింది. ప్రాచీన భారతదేశ చరిత్రలోని షోడస మహాజన పదాలలోని అస్మక లో భాగంగా ఉన్న ఈ ప్రాంతం, శాతవాహన రాజుల ఏలుబడిలోను ఒక అటవి ప్రాంతంగా ఉండేది. అనంతరం చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు సహా అనేక దక్షిణ భారత రాజవంశాల పాలనలోకి వచ్చింది. మధ్యయుగంలో కాకతీయుల పాలనలో ప్రగతి సాధించిన ఈ ప్రాంతం, తదనంతరం బహమనీ సుల్తానులు, గోల్కొండ కుతుబ్‌షాహీల పాలనలోను మన్నిక సాధించింది.

17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దక్షిణాదిపై దండయాత్ర చేసినప్పుడు, నిర్మల్ ప్రాంతం మొఘల్ సుబేదార్ల పరిపాలనలో ప్రముఖ కేంద్రంగా మారింది. నిజాం నవాబుల పాలనలో నిర్మల్ ఒక ముఖ్యమైన పరిపాలనా, వాణిజ్య కేంద్రంగా ఎదిగింది. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండ్, ఆయన వెయ్యి మంది అనుచరులను నిర్మల్ లోనే ఒక మర్రి చెట్టుకు ఉరితీశారు. నేటికి ఆ ప్రాంతం వెయ్యి ఉరుల మర్రిగా ప్రసిద్ది. భారత స్వాతంత్ర్య పోరాట సమయంలో నిర్మల్ కూడా తెలంగాణా ప్రాంతంలోని రైతాంగ ఉద్యమాలు, సాంస్కృతిక పునరుద్ధరణలో భాగమైంది. పోలీస్ యాక్షన్ తరువాత నిర్మల్ హైదరాబాదు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. 2014లో తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత, నిర్మల్ జిల్లా కేంద్రంగా గుర్తింపు పొందింది.

నిర్మల్ చిత్రకళలు, వుడ్ క్రాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందాయి. నిర్మల్ పెయింటింగ్స్‌లో పౌరాణిక గాథలు, ప్రకృతి దృశ్యాలు, జంతువులు, పక్షుల చిత్రాలు ఆకర్షణీయంగా వర్ణించబడతాయి. నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవాలయం దేశవ్యాప్తంగా విద్యార్ధులకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తోంది. ప్రతీ సంవత్సరం వేలాదిమంది విద్యార్ధులు అక్షరారంభం చేసుకోవడానికి ఇక్కడకు చేరుకుంటారు. ఇలాంటి ఆధ్యాత్మిక-విద్యా క్షేత్రం ఉన్న నిమ్మల్‌లో విశ్వవిద్యాలయం స్థాపన విద్యా వాతావరణాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం స్థూల నమోదు రేటు 28% కాగా, 2035 నాటికి ఉన్నత విద్యలో 50% స్థూల నమోదు రేటు సాధించాలని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీని వలన భారత ఉన్నత విద్యా వ్యవస్థలో విద్యార్థుల సంఖ్య సుమారు 9 కోట్లకు పెరుగుతుందని, 2021-22లో దాదాపు 4.33 కోట్ల విద్యార్థుల నమోదును సమర్థవంతంగా రెట్టింపు చేస్తుందని అధికారిక అంచనాలు తెలుపుతున్నాయి. భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్యలో ఈ గణనీయమైన పెరుగుదలను తీర్చడానికి, ప్రస్తుతం ఉన్న విశ్వవిద్యాలయాల సంఖ్యకు దాదాపు రెట్టింపు అవసరం కావచ్చు. ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే (AISHE) ప్రకారం, భారతదేశంలో 1,160 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.

వాటిలో 52 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 808 రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు. అదేవిధంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన 152 సంస్థలు, రాష్ట్ర శాసనసభ చట్టం కింద 6 సంస్థలు కూడా ఉన్నాయి. దేశంలోని 1160 విశ్వవిద్యాలయాలలో 680 విశ్వవిద్యాలయాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 480 విశ్వవిద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దీని అర్థం మొత్తం జనాభాలో 66% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ, 41% విశ్వవిద్యాలయాలు మాత్రమే గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దీనికి విరుద్ధంగా 59% విశ్వవిద్యాలయాలు పట్టణ ప్రాంతాల్లోని 34% జనాభాకు సేవలు అందిస్తున్నాయి. తెలంగాణలో 18-23 సంవత్సరాల వయస్సు గల వారిలో ప్రతి లక్ష మంది జనాభాకు 59 కళాశాలలు ఉన్నాయి. ఇది అఖిల భారత సగటు 28 కంటే గణనీయంగా ఎక్కువ. తెలంగాణలో విభిన్న శ్రేణి సంస్థలతో కూడిన బలమైన ఉన్నత విద్యారంగం ఉన్నప్పటికినీ ఇది నిర్మల్ వంటి ఉత్తర తెలంగాణ వాసుల విద్యావసరాలను తీర్చడం లేదు.

భారతదేశంలోని రాష్ట్రాల మధ్య విశ్వవిద్యాలయాల పంపిణీలో తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.రాజస్థాన్‌లో 93, గుజరాత్‌లో 91, ఉత్తరప్రదేశ్‌లో 87 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అయితే, అండమాన్ , నికోబార్ దీవులు, లక్షద్వీప్, దాద్రా , నాగర్ హవేలి, డామన్ డయ్యూ వంటి కేంద్రపాలిత ప్రాంతాలలో విశ్వవిద్యాలయాలే లేవు. తెలంగాణ రాష్ట్రంలో 28 విశ్వవిద్యాలయాలు ఉండగా, అందులో 17 రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, 3 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, 3 కేంద్ర విశ్వవిద్యాలయాలు, 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అదనంగా, ఇటీవల మరో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఆమోదించబడ్డాయి. ఈ ప్రైవెటు విశ్వవిద్యాలయాలలో ఎలాగు పేదవారికి విద్య అందించబడదు కాబట్టి, నిర్మల్ వంటి ప్రాంతాలలో విశ్వవిద్యాలయం నెలకొల్పడం వలన కేవలం నిర్మల్ జిల్లా వాసులకే కాకుండా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లా వాసులు సైతం అడ్మిషన్ పొందవచ్చు. నిర్మల్ లో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి డా .వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆమోదం తెలిపినప్పటినీ, కారణాంతరాల వలన కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఈ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చినప్పటికీ, రాజకీయ ఒత్తిడిలతో అప్పుడు కూడా ఆ ప్రతిపాదన అటకెక్కింది. ఇదే సమయంలో కాకతీయ యూనివర్సిటీ పిజి స్టడీ సెంటర్ ను నిర్మల్ నుండి తరళించడం ఆ ప్రాంత విద్యార్థులకు గోరు మీద రోకటి పోటు చందంలా అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యలన్నింటికి పరిష్కారం నిర్మల్ లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడమొక్కటే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *