అసెంబ్లీ స్పీకర్‌కు మరో రెండు వారాల గడువు

– ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంలో విచారణ, వాయిదా

న్యూదిల్లీ, జనవరి 16 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ చేపట్టిన పక్రియపై రెండు వారాల తరువాత అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే నాలుగు వారాల సమయం కావాలని స్పీకర్‌ తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఫ్వీు న్యాయస్థానాన్ని కోరారు. కేసులో పురోగతిని పరిశీలించి అవసరమైతే మరో రెండు వారాల గడువు పెంచుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ల ధర్మాసనం ముందు శుక్రవారం విచారణకు వచ్చింది.

నాలుగు వారాల సమయం కావాలి

బీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురి అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారని, మిగతా ముగ్గురిపై నిర్ణయానికి కొంత సమయం కావాలని స్పీకర్‌ తరఫు న్యాయవాది కోరారు. స్పీకర్‌కు కంటి శస్త్ర చికిత్స జరగడంతో హాస్పిటల్‌లో ఉన్నారని, కొత్త అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ వచ్చినందున పక్రియ ఆలస్యమైందని న్యాయవాది అభిషేక్‌ మనుసింఫ్వీు కోర్టుకు నివేదించారు. ఇప్పటివరకు స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాలను నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించారు. మిగతా ముగ్గురు సభ్యులపై నిర్ణయం తీసుకునేందుకు నాలుగు వారాల సమయం కావాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. గత ఏడాదిగా ఇదే చెబుతున్నారని బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. గతంలో మూడు నెలల్లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోలేదని పాడి కౌశిక్‌ రెడ్డి తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారని, మిగిలిన ముగ్గురిపై నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని అభిషేక్‌ మనుసింఫ్వీు కోర్టును కోరారు. అయితే రెండు వారాల సమయం ఇస్తున్నామని, ఆ సమయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో కోర్టుకు చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. తరువాత అవసరమైతే మరో రెండు వారాల సమయం ఇస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం చెబుతూ విచారణను వాయిదా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *