ప్రభుత్వ రంగ సంస్థల క్షీణత: ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ?

“జాతీయ ఆస్తులు కాపాడే బాధ్యత అవసరం. ప్రభుత్వం తరచూ చెప్పేది – “వాణిజ్యం చేయడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు” . అయితే సత్యం ఏమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నడపలేని ప్రభుత్వం, ఉద్యోగాలు సృష్టించలేని ప్రభుత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడలేని ప్రభుత్వం జాతీయ ఆస్తులు అమ్మే హక్కు లేదు. భారత ప్రజా రంగం దేశ స్వావలంబనకు, సామాజిక సమానత, మౌలిక అభివృద్ధికి పునాది. దానిని తొందరపాటు నిర్ణయాలతో అడ్డగోలుగా విక్రయించడం భవిష్యత్తు తరాల పట్ల ఘోర అన్యాయం.”

భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఒక సంక్రమణ దశలో ఉంది. దేశ అభివృద్ధికి పునాది వేసిన ప్రభుత్వ  రంగ సంస్థలు  నేడు  సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి యాదృచ్ఛికం కాదు; గత దశాబ్దంలో అమలైన కొన్ని పొరపాటు  నిర్ణయాలు, ఆలోచనలేని సంస్కరణలు, మరియు జాతీయ ఆస్తుల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం.  ఒక దశాబ్దపు ఆర్థిక పొరపాట్లు ఒకసారి పరిశీలిస్తే  భయమేస్తుంది.  2016 నవంబర్ 8 రాత్రి జరిగిన నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బతీసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ హెచ్చరించినట్టు జిడిపిలో 2% పడిపోవడం ఒక్కటే కాదు, దేశపు అనధికారిక రంగం పూర్తిగా కుదేలైంది. లక్షలాది చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతబడ్డాయి.  ఆ దెబ్బ నుంచి కోలుకునే లోపే, ప్రభుత్వం తయారీ సరిగా లేని జీఎస్టీ  ను అమలు చేసింది. పలుస్థాయిల పన్నులు, క్లిష్టమైన రిటర్నులు, చిన్న వ్యాపారులకు తీవ్రమైన భారమయ్యాయి. ఈ రెండు నిర్ణయాలు కలిసి ఆర్థిక వ్యవస్థను దీర్ఘకాలిక మాంద్యంలోకి నెట్టాయి.
ప్రజలపై భారమయ్యే పన్నులు  కార్పొరేట్లకు పెద్దలాభాలు తెచ్చిపెట్టాయి.  ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తగ్గిన సందర్భంలో, సాధారణంగా ప్రభుత్వాలు ప్రజలకు ఆ ప్రయోజనాలు అందిస్తాయి. కానీ ఇక్కడ ధరలు తగ్గినా, పన్నులు మాత్రం పెరిగాయి. కుటుంబ ఖర్చు పెరిగాయి. అదే సమయానికి, 2019లో ప్రభుత్వం కార్పొరేట్లకు భారీ పన్ను రాయితీ ఇచ్చింది. దేశ ఖజానాకు ₹1.45 లక్షల కోట్ల నష్టం జరిగినా, పెట్టుబడులు పెరగలేదు.  ప్రజా రంగ సంస్థల ‘ఫైర్ సేల్’.  ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన మార్గం,  అతివేగంగా ప్రైవేటీకరణ. ఇది సంప్రదాయ ‘డిస్ఇన్వెస్ట్‌మెంట్’ కాదు. ఇది జాతీయ ఆస్తుల ‘అమ్మకం’ —  అది కూడా తొందరపాటు, అత్యవసర సమయాల్లో చేసే ఫైర్ సేల్ విధానంలో.  ప్రభుత్వ వాదన ఏంటంటే  ప్రైవేటీకరణ వల్ల సామర్థ్యం పెరుగుతుంది, సంక్షేమ పథకాలకు నిధులు లభిస్తాయి. కానీ నిజంగా జరుగుతోందేమిటంటే  లాభాలు ప్రైవేట్ రంగానికి, నష్టాలు ప్రజల భుజాలపై.  అవమానకరమైన చరిత్ర పాఠాలు తెలుసుకున్నా  ప్రభుత్వ తీరు మారలేదు.
గత  ఎన్డీయే  ప్రభుత్వ కాలంలో  బిఎస్ఎన్ఎల్  విక్రయం తక్కువ విలువలో జరిగినట్లు అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. నేడు కూడా   ఎల్ఐసి – ఐడీబీఐ, ఓఎన్జీసీ, హెచ్పిసీఎల్  వంటి లావాదేవీలు నిజమైన డిస్ఇన్వెస్ట్‌మెంట్ కావు; అవి ప్రభుత్వం ఒక జేబులోంచి మరొక జేబులో డబ్బు మార్చినట్టు.  దీర్ఘకాల ప్రమాదాలు గురించి ప్రభుత్వం దగ్గర  సమాధానాలు లేవు.  బ్యాంకింగ్ స్థిరత్వం: ప్రభుత్వ బ్యాంకులు 2008 గ్లోబల్ సంక్షోభాన్ని భారత్‌ను ఎలా రక్షించాయో దేశం మరిచిపోలేదు. ఇప్పుడు ఇవే ప్రైవేటీకరణ గురిపెట్టబడుతున్నాయి. ఎల్ఐసి  భవిష్యత్తు  అగమ్యగోచరంగా ఉంది. ఎల్ఐసి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రధాన ఆర్థిక ఆధారం. దానిని ప్రైవేట్ హస్తాల్లోకి ఇవ్వడం అంటే దీర్ఘకాల పెట్టుబడుల భవిష్యత్తును ప్రమాదంలో పెట్టినట్టే. సామాజిక న్యాయం పూర్తిగా  తుడిచి పెట్టినట్టే.  దళితులు, ఆదివాసీలు, ఓబిసిలకు ఉన్న రిజర్వేషన్లు ప్రభుత్వ వాటా 50% కంటే తక్కువైతే సహజంగానే రద్దవుతాయి. ప్రాంతీయ అభివృద్ధి కుంటుపడింది.  లాభం రాకపోతే గ్రామీణ బ్యాంకు శాఖలను ప్రైవేట్ సంస్థలు కొనసాగిస్తాయా? అనుమానమే.
ఇప్పటికే నిరుద్యోగం అత్యధిక స్థాయిలో ఉండగా, ప్రజా రంగ ఉద్యోగాలకు ముప్పు వస్తే దాని ప్రభావం ఘోరంగా ఉంటుంది. ఎక్కడ స్పష్టత లేదు.  ఆస్తులకు విలువ ఎలా నిర్ణయించారు?  రిజర్వ్ ప్రైస్ ఎలా లెక్కించారు?  బిడ్డర్లను ఎలా ఎంచుకున్నారు?  ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానమివ్వకుండా ముందుకు సాగుతుండటం అనుమానాలు మరింత పెంచుతుంది,  ముఖ్యంగా ఎలక్షన్ బాండ్స్ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత.  నిదానమైన, సంస్థ నిర్ధిష్ట వ్యూహం అవసరం.  అన్ని ప్రభుత్వరంగ సంస్థలు  ఒకేలా ఉండవు.  కొన్ని లాభాల్లోనే ఉన్నాయి. కొన్ని పునర్‌వ్యవస్థీకరణ చేస్తే లాభదాయకమవుతాయి.
కొన్ని మాత్రమే అమ్మకానికి అనర్హం. ప్రతి సంస్థకు విడిగా వ్యూహం అవసరం. దీర్ఘకాలిక దృష్టి అవసరం. జాతీయ ఆస్తులు కాపాడే బాధ్యత అవసరం. ప్రభుత్వం తరచూ చెప్పేది – “వాణిజ్యం చేయడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు” .  అయితే సత్యం ఏమిటంటే,  దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నడపలేని ప్రభుత్వం, ఉద్యోగాలు సృష్టించలేని ప్రభుత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడలేని ప్రభుత్వం  జాతీయ ఆస్తులు అమ్మే హక్కు లేదు.  భారత ప్రజా రంగం దేశ స్వావలంబనకు, సామాజిక సమానత, మౌలిక అభివృద్ధికి పునాది. దానిని తొందరపాటు నిర్ణయాలతో అడ్డగోలుగా విక్రయించడం భవిష్యత్తు తరాల పట్ల ఘోర అన్యాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page