~ శ్రీపాద నరేష్ మృతిని ధ్రువీకరించిన బహరేన్‌లోని ఇండియన్ ఎంబసీ
– ఇపుడు శవాన్ని ఇండియాకు తరలించడం సాధ్యం కాదు
– అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలని ఎంబసీ సూచన
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: గల్ఫ్ దేశమైన బహరేన్‌లో చనిపోయిన తెలంగాణ వాసికి ఐదేళ్ల నాలుగు నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) జారీ చేసిన అరుదైన సంఘటన జరిగింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం రాంనగర్‌కు చెందిన శ్రీపాద నరేష్ 2020 మే 28న బహరేన్‌లో సల్మానియా హాస్పిటల్‌లో మృతిచెందాడు. అక్కడి ఇండియన్ ఎంబసీ 2025 అక్టోబర్ 1న డెత్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని బహరేన్‌లోని ఇండియన్ ఎంబసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 30న అధికారికంగా ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. సెప్టిక్ షాక్‌తోపాటు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, కమ్యూనిటీ అక్వైర్డ్ న్యుమోనియా కారణంగా మృతిచెందిన నరేష్ మృతదేహాన్ని సల్మానియా హాస్పిటల్ మార్గ్యూ (శవాగారం)లో భద్రపరిచినట్లు తెలిపారు. చనిపోయి చాలాకాలం అయినందున మృతదేహం రవాణా చేయదగిన స్థితిలో లేనందున ఆయన కుటుంబ సభ్యులు బహరేన్‌లోనే అంత్యక్రియలు/సమాధి నిర్వహణకు తమ సమ్మతిని తెలియజేయవలసిందిగా కోరనైనది అని ఎంబసీ తెలియజేసింది. ఇండియన్ ఎంబసీ అధికారులను ఉటంకిస్తూ ఇటీవల ఒక పత్రికలో వార్త రావడంతో నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్‌లో మృతిచెందిన విషయం వెలుగులోకి వచ్చింది. నరేష్ భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) పిల్లలు లేక ఒంటరిగా తల్లిదండ్రుల ఊరు కథలాపూర్ మండలం కలికోటలో కడు పేదరికంలో జీవిస్తోంది. ఏనాటికైనా తన భర్త వస్తాడని 18 ఏళ్లుగా ఆమె ఎదురుచూస్తోంది. నరేష్‌కు తల్లిదండ్రులు, దత్తత తల్లిదండ్రులూ చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ నియమిత అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సామాజిక సేవకుడు బొక్కెనపల్లి నాగరాజు సహకారంతో మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ నరేష్, చిన్నమ్మ తిప్పర్తి పద్మ, సామాజిక సేవకులు మాడిశెట్టి రాకేష్, మొరపు తేజలు ఈనెల 28న సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డిని కలిసి నరేష్ మృతదేహం తరలింపు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సచివాలయంలో ఎన్నారై విభాగం జాయింట్ సెక్రటరీ సిహెచ్.శివ లింగయ్యను, సెక్షన్ ఆఫీసర్ కంచర్ల శ్రీనివాసరెడ్డిని కలిసి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా బహరేన్‌లోని సామాజిక సేవకులు కోటగిరి నవీన్, డి.వి.శివకుమార్, నోముల మురళిలు ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేస్తున్నారు. బహరేన్‌లో నిర్వహించనున్న నరేష్ అంత్యక్రియలకు హాజరు కావడానికి రాష్ట్ర ప్రభుత్వం, ప్రవాసీ సంఘాలు సహాయం చేయాలని ఆనంద్ కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




