పొంత‌న‌లేని విద్యుత్ గ‌ణాంకాలు

– మంత్రుల‌ను నేరుగా ప్ర‌శ్నించిన హ‌రీష్‌రావు
– మీ శాఖ‌ల‌పై మీకు అవ‌గాహ‌న లేక‌పోతే ఎట్లా?
– అధికార్లు ఇచ్చిన లెక్క‌లు గుడ్డిగా చ‌దువుతున్నారు
– పైగా బీఆర్ ఎస్ పై నింద‌లు. ఇదెక్క‌డి న్యాయం

శ‌నివారం మీరు పీపీటీలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క  చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒక దానికి మరొకటి పొంతన లేకుండా వున్నాయంటూ మాజీ మంత్రి హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. డిప్యూటీ సీఎంగా, విద్యుత్ మంత్రిగా రెండేళ్లు పూర్తయినప్పటికీ.. మీ శాఖలోని విషయాలపై మీకు ఏమాత్రం అవగాహన లేకున్నప్పటికీ ఇతరులను అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని కామెంట్ చేయడం మీకు ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. మీ అధికారులు ఒక్కో సారి, ఒక్కో లెక్కలతో.. మీ చేతుల మీదుగానే ఆవిష్కపరింప చేస్తున్నారంటే మీ శాఖపై మీకు కనీస అవగాహన కూడా లేదన్నది స్పష్టమ‌వుతోంద‌న్నారు.  ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ద, పాలసీలపై ఉండి ఉంటే.. ఈ పొరపాట్లు జరగవు కదా! మీరు ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా లెక్కలు చెబుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు మీ శ్వేత‌ప్ర‌తం 2023 డిసెంబ‌ర్ 1 నాటికి సోలార్ కెపాసిటీ 6123 మెగావాట్లు అని చెప్పారు. అదే న‌వంబ‌ర్ 1న విడుద‌ల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పేజీ నెం.8లో కరెంట్ ఇన్టాల్డ్ కెపాసిటీ 5,415 మెగావాట్లు అన్నారు. అప్ కమిగ్ 2,474 అన్నరు. మొత్తం 7,889 మెగావాట్లు అన్నరు. 2023లో 6123 మెగావాట్లు ఉంటే, 2025 నాటికి 5,415 మెగావాట్లు ఎట్ల అయ్యింది? పెరుగుతుందా? తగ్గుతుందా? అని ప్ర‌శ్నించారు. ఈరోజు మీరు ప్రదర్శించిన పీపీటీలో ఏం లెక్క చెప్పారో మీకు తెలుసా? గతంలో ప్రకటించిన పాలసీ, శ్వేతపత్రంతో పోల్చి చూసుకున్నారా? అని ప్ర‌శ్నించారు. మీ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పేజీ నెం.8లో తెలంగాణ కరెంట్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 26,212 మెగావాట్లు అన్నరు. అదే పాలసీ పేజీ నెంబర్ 10లో 2029-30 నాటికి 49,104 మెగావాట్లు అన్నరు. 2034-35కు 66,694 మెగావాట్లు అన్నరు. అంటే మీరు పెట్టుకున్న లక్ష్యంలో 2029-30 నాటికి 1729 (15,893-14,164) మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నార‌న్న‌మాట‌! మొన్న మీరిచ్చిన క్యాబినెట్ నోట్ ప్రకారం, 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నారు. అటువంట‌ప్పుడు మీరే ఇచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఎందుకు తుంగలో తొక్కారని ప్ర‌శ్నించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, 1600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ అందుబాటులో ఉండగా, ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా ఎందుకు హడావుడిగా 2400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణానికి వెళుతున్నారంటే ఇందులో రూ. 50వేల కోట్ల ఖ‌ర్చులో 30-40శాతం కమీషన్ పొందడానికే కాదా? అని ప్ర‌శ్నించారు. 2025 ఎనర్జీ పాలసీ కాపీ 10వ పేజీలో 2034-35 వరకు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 16,966 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఈరోజు మాత్రం 5000-6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ లోటు ఉండబోతున్నదని ఎట్లా అన్నార‌ని ప్ర‌శ్నించారు. నేటికి 14,164 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉందని మీ పాలసీలోనే చెప్పారు, 2034-35కు 16,966 మెగావాట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే మీ లెక్క ప్రకారం లోటు 2802 మెగావాట్ల లోటు ఉండాలె. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం పేజీ నెం.11లో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోల్ ట్రాన్స్ పోర్టుకు ఏడాదికి రూ. 803 కోట్లు కావాలని పేర్కొన్న‌ది మీరే కదా? క్యాబినెట్ మంత్రిగా ఉండి నేడు 1600 కోట్లు ఖర్చు అవుతుందని ఎట్ల మాట్లాడుతారని ప్ర‌శ్నించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును తప్పు పట్టిన నాటి కాంగ్రెస్ నాయకులకు, క్యాబినెట్ లో చర్చించి మక్తల్ వద్ద థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన చేసింది మీరు కాదా?   నాడు యాదాద్రి తప్పు అయితే, నేడు మక్తల్ ఒప్పు అవుతుందా? మక్తల్ లో పెట్టబోయేది థర్మలా, సోలారా, విండా అనేది చర్చిస్తున్నామని నేడు భట్టి గారు చెప్పడం హాస్యాస్పదమ‌న్నారు.
మక్తల్ వద్ద 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని స్వయంగా మంత్రులే చెప్పింది అబద్దమా? నేడు భట్టి గారు చెబుతున్నది అబద్దమా? ఏది అబద్దం ఏది నిజమ‌ని ప్ర‌శ్నించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఒక్క మెగావాట్ కు రూ.8.64 కోట్లు ఖర్చు అయ్యిందని, ఎన్టీపీసీ రామగుం డంలో రూ. 7.63 కోట్లు ఖర్చు అయ్యిందని శ్వేతపత్రం పేజీ నెంబర్ 11లో చెప్పారు. ఎన్టీపీసీ ఫేజ్ 2, 2023 డిసెంబర్ 1 నాటికి 3×800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇంకా మొదలు పెట్టలేదని శ్వేతపత్రంలో నాడు మీరే ప్రకటించారన్న విషయం మీకు తెలుసా? అది క్లియర్ గా ప్రకటించి బిఆర్ఎస్ మీద ఎందుకు నెపం నెడుతున్నారని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసాక 800 మెగావాట్లకు మీరు అగ్రిమెంట్ చేసుకొని, మిగతా 1600 మెగావాట్లు అక్కర్లేదని చెప్పింది నిజమా? అబద్దమా? అని ప్ర‌శ్నించారు.  మీరు ఏర్పాటు చేసే రామగుండం పవర్ ప్లాంటు పర్ మెగావాట్ 14కోట్లు ఖర్చు అవుతుం దని క్యాబినెట్ ప్రెస్ బ్రీఫింగ్ లోనే చెప్పారు. కానీ ఎన్టీపీసీ 12.3 కోట్లు. పర్ మెగావాట్ కు దాదాపు 2 కోట్లు ఎందుకు వచ్చింది అనే విషయం చెప్పకుండా ఇంకా డీపీఆర్ కాలేదని బుకాయిస్తున్నరు.
మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు అప్పగిస్తాన్న ప్రకటనలు ఎక్కడి దాకా వచ్చిందని మొన్న నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేసి, ప్రతిపక్షాల మీద బురద చల్లడానికి ఉపయోగించుకున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని, ప్రతిపక్ష నాయకులపై దురుసుగా మాట్లాడే పద్దతిని మార్చుకోవాలని హితవు ప‌లికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *