– వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
వరంగల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27ః వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నేరాలు నియంత్రణలో వున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. భీమారంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక 2025 సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు సంబంధించి నివేదికలోని వివరాలను కమిషనర్ వెల్లడిస్తూ గత ఏడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల సంఖ్య పెరిగిందని, గత ఏడాది 14,412 కేసులు నమోదు కాగా 2025లో 14,456 కేసులు నమోదు అయ్యాయని, హత్య చేసి దోపిడీ కేసులు 4, దారి దోపిడీ 3, దోపిడీలు 16, దొంగతనాలు 355 కేసులు నమోదయ్యాయన్నారు. హత్యలు 36, అత్యాచారాలకు సంబంధించి గత ఏడాది 145 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరంలో 132 కేసులు నమోదయ్యాయని, వీటితోపాటు వరకట్న మరణాలు, గృహ నేరాలు తగ్గు ముఖం పట్టగా, పోక్సో కేసులు గత ఏడాది 364 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 405 కేసులు నమోదయ్యాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.గత ఏడాదితో పోలిస్తే 1504 కేసులు నమోదు కాగా ప్రస్తుతం 1453 కేసులు నమోదుయ్యాయన్నారు. మొత్తం మీద 3.6శాతం మహిళలపై నేరాలు తగ్గు ముఖం పట్టాయని చెప్పారు.
రూ.8 కోట్ల 62లక్షల విలువైన మత్తు పదార్థాలు పట్టివేత
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈఏడాదిలో 195 కేసుల్లో మొత్తం 482మందిని అరెస్టు చేసి వీరి నుండి రూ.8.62 కోట్ల విలువగల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకోగా ఇందులో 1700 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. చోరీలకు సంబంధించి ఏడాది మొత్తంలో దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 14 గ్యాంగ్‌లకు సంబంధించి 33కేసుల్లో 52 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ముఖ్యంగా సిసిఎస్ విభాగం 84 చోరీ కేసుల్లో మొత్తం రూ.79 లక్షల విలువ చోరీ సోత్తును పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ కేసులకు సంబంధించి ఈ ఏడాది 1424 కేసుల్లో 430 మంది మృతిచెందగా, 1446 మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులు 34,282 నమోదు కాగా ఇందులో 887 మందికి జైలు శిక్ష విధించామన్నారు. సైబర్ క్రైమ్‌కు సంబంధించి 630 కేసులు నమోదు అయ్యాయని సీపీ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 6,040 కేసులు పరిష్కారం కాగా ఇందులో 2,573 మందికి శిక్షలు ఖరారు అయ్యాయి. ఇందులో ప్రధానంగా 16 మందికి జీవితఖైదు, మరో ముగ్గురికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. గతే ఏడాది కంటే మూడు శాతం అధికంగా నేరస్తులకు శిక్షలు పడ్డాయని, ప్రధానంగా నేరాల నియంత్రణలో టాస్క్‌ఫోర్స్ పోలీసుల పనితీరు అభినందనీయమని, ఈ విభాగం వివిధ నేరాలకు సంబంధించి మొత్తం 418 కేసుల్లో 978 మంది అరెస్టు చేయడంతోపాటు సుమారు రూ.14.80 కోట్ల సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. రాబోవు నూతన సంవత్సరంలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సహకారంతో నేరాల నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతల పరిరక్షణే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని సీపీ తెలిపారు. ఈ కార్యక్రమములో డీసీపీలు మహేంద్రనాయక్, కవిత, ఏ.ఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్‌తోపాటు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



