నిరుద్యోగుల‌పై ద‌మ‌న‌కాండ‌

– ఓట్ల‌ కోసం వీరి చుట్టూ పొర్లు దండాలు పెట్టారు
– ప్ర‌చారానికి వాడుకొని వ‌దిలేశారు
– అవ‌స‌రం తీరాక ఉక్కుపాదం
– ఉద్యోగాలివ్వ‌లేదు.. లాఠీలు, అరెస్ట్ ల బ‌హుమానం
– ఇదీ రేవంత్ ప్ర‌భుత్వ తీరు
– ఎద్దేవా చేసిన హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: నిన్న దిల్‍సుఖ్‍నగర్, నేడు అశోక్ నగర్ లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగ బిడ్డలపై పోలీసులు క్రూరంగా విరుచుకుపడడాన్ని  మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.  ఇది నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లపై రేవంత్ సర్కారు సాగిస్తున్న దమన కాండ త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లైబ్రరీ చుట్టూ చక్కర్లు కొట్టి పొర్లుదండాలు పెట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారు. వారి ఉద్యోగ కాంక్షను ఆసరా చేసుకొని, వారిని కాంగ్రెస్ కార్యకర్తలుగా మార్చుకొని ఇంటింటికి తిప్పి ప్రచారానికి వాడుకున్నారు. అధికార పీఠం ఎక్కగానే అదే నిరుద్యోగ గొంతులపై ఉక్కు పాదం మోపి తొక్కుతున్నారని విమ‌ర్శించారు. ఇవాళ తెలంగాణలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది. పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్లు ఇప్పుడు నిరుద్యోగులకు లాఠీ చార్జీలు, అరెస్టులు, సంకెళ్లను బహుమతిగా ఇస్తున్నారని విమ‌ర్శించారు. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసారు. రెండేళ్లలో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్ర‌భుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్న‌ద‌న్నారు. ఈ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అరెస్టులు చేయ‌డం అన్యాయ‌మ‌న్నారు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నావంటూ రేవంత్‌రెడ్డిని విమ‌ర్శించారు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు. ఈరోజు గాయపడిన ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పి తీరాలి. దాడికి బాధ్యులైన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. నిర్బంధాలను ఆపి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి నిరుద్యోగులను లాకప్ హింసకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా బీఆర్ ఎస్‌ చూస్తూ ఊరుకోదని ప్రభుత్వాన్ని హెచ్చ‌రించారు. అరెస్టు చేసిన నిరుద్యోగ సోదరులను భేషరతుగా తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *