మావోయిస్టు పార్టీపై కావాల‌నే దుష్ప్ర‌చారం..

  • దామోద‌ర్ లొంగిపోతున్న‌ట్లు ఫేక్ న్యూస్‌ 
  • ఇది పోలీసుల మైండ్ గేమ్ మాత్ర‌మే.. 
  • మంత్రి సీత‌క్క‌కు వ‌చ్చిన లేఖ‌తో మాకు సంబంధం లేదు.. 
  • సీపీఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 5 : జూన్ 1న తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్ర‌తినిధి దామోదర్ లొంగిపోతున్నట్లు దినపత్రికలు, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేశారు. మీడియా చేసిన ఈ ప్రకటనలలో ఎలాంటి వాస్తవం లేదని . పోలీసులే కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ దుష్ప్రచారం చేస్తున్నారని సీపీఐ(మావోయిస్టు) పార్టీ (CPI (Maoist Party) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విమ‌ర్శించారు. ఈమేర‌కు ఆయ‌న శ‌నివారం ఒక లేఖ‌ను విడుద‌ల చేశారు. గతంలో కూడా దామోదర్ ఎన్‌కౌంట‌ర్‌లో చనిపోయినట్లు లేదా లొంగిపోతున్నట్లు అనేక సార్లు ప్రచారం చేశారు. ప్రజలను గందరగోళానికి గురిచేయ‌డానికి మానసిక యుద్ధంలో భాగంగానే ఈ దుష్పచారం కొనసాగుతోంద‌ని మండిప‌డ్డారు. ఇటీవల మా పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో జూన్ 26న మంత్రి సీతక్క‌పై వొచ్చిన పత్రికా ప్రకటనకు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు.

అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై కొనసాగిస్తున్న పాశవిక ఆపరేషన్ కగార్‌ను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. ఎన్కౌంటర్లు ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది. మావోయిస్టు పార్టీ సమస్య సామాజిక, రాజకీయ సమస్యని, అణచివేతల ద్వారా మావోయిస్టు పార్టీని నిర్మూలించడం సరికాద‌ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి ప్రజలకు తెలిసిందే… ఇది ఇలా ఉంటే తెలంగాణలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు లేకపోయినప్పటికీ పోలీసులు మాత్రం మావోయిస్టు పార్టీకి ప్రజలు ఎలాంటి సహకారాన్ని అందించొద్ద‌ని, సహకరించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, మావోయిస్టు పార్టీ వొస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలలో అమాయక ఆదివాసీ ప్రజలను పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలని జ‌గ‌న్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *