హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి గుణపాఠం

– అప్పీళ్లు, కోర్టు కేసులతో యువతకు అన్యాయం చేయొద్దు
– బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9: టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ కేసులో హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం లభించడంపై సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు హర్షించదగినదని, గతంలో గ్రూప్‌-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు సాక్ష్యాధారాలతో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ టీజీపీఎస్సీ మొండిగా వ్యవహరించిందని ఆరోపించారు. నిరుద్యోగుల ఆరోపణలను, వారు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా మూర్ఖంగా ముందుకు పోయిందన్నారు. వారిపై కేసులు పెట్టి అణచివేతకు పాల్పడి లాఠీచార్జి చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈరోజు హైకోర్టు తీర్పుకు ఏం సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ గ్రూప్‌-1 బాధితుల అలుపెరగని పోరాటానికి దక్కిన గెలుపు అని అన్నారు. హడావుడిగా పరీక్షలు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన మీ వైఖరికి నేడు విద్యార్థులు నష్టపోతున్నారని మండిపడ్డారు. గ్రూప్‌-1 పరీక్షల్లోని అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన బాధితులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. ఉద్యోగాలను అంగట్లో సరకు మాదిరి అమ్ముకోవాలని చూసిన కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దల స్వార్థానికి హైకోర్టు తన తీర్పు ద్వారా అడ్డుకట్ట వేయడం చారిత్రక నిర్ణయమన్నారు. ఇచ్చిన హామీల సంగతి దేవుడెరుగు.. కనీసం ఉద్యోగాలు భర్తీ చేయడం, అక్రమాలు లేకుండా పరీక్షలు ఎలా నిర్వహించాలో కూడా చేతగాని ఈ ప్రభుత్వ అసమర్థతను రాష్ట్ర యువత, విద్యార్థులు గుర్తిస్తున్నారన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎనిమిది నెలల్లోపు రీ-వాల్యుయేషన్‌ లేదా పరీక్ష తిరిగి నిర్వహించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. అప్పీళ్లు, కోర్టు కేసులు అంటూ యువతకు అన్యాయం చేయవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్న తీరుగా గ్రూప్‌-1 పరీక్షలను తిరిగి నిర్వహించి వేగంగా పూర్తి చేయాలని కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *