– నేను విద్యామంత్రి అయితే వాటిని మూయించేస్తా
– నల్లగొండలో ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ స్కూలు నిర్మాణం
– రూ.8కోట్లతో అత్యాధునికంగా నిర్మించామన్న కోమటిరెడ్డి
నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 27: కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులతో ప్రజలను దోచుకుంటున్నారని.. తాను విద్యాశాఖ మంత్రి అయితే అలాంటి స్కూళ్లను మూసివేయిస్తానని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్య వ్యాపారం కావద్దని తేల్చిచెప్పారు.నల్గగొండ టౌన్‌లోని బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ ప్రజల రుణం తీర్చుకోవడానికే నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ చేశా. కేంద్రం నుండి నిధులు తెచ్చి నల్లగొండ రూపు రేఖలు మారుస్తానని అన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే వెయ్యి, 2 వేల కోట్ల నిధులైనా ఇస్తారన్నారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుంది. నాకు ఉత్సాహం ఉంటే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తా. లేకుంటే ప్రతీక్ స్కూల్‌లో విద్యార్థులను చదివిస్తూ జీవితం గడుపుతానన్నారు. ఈ స్కూల్ విద్యార్థులను ఆణిముత్యాల్లా తీర్చిదిద్ది ఐఏఎస్, ఐపీఎస్‌లుగా తయారు చేయాలి. నిజాయితీగా బతికా.. పేదవారికి సహాయం చేశా. చదువంటే ర్యాంకులు మాత్రమే కాదని ఓ ఆలోచన చేశాం. విద్యకు ప్రాధాన్యత ఇచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నాం. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా డిజిటల్ విద్యను అందిస్తాం అని చెప్పారు. సరైన విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని వెంకట్‌రెడ్డి అన్నారు. విద్యకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పాఠశాలలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు రూ.200కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని.. కులమతాలకు అతీతంగా విద్యార్థులు చదువుకోవాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను సర్కారు పాఠశాలల్లో చదివించి మార్పు తీసుకురావాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి సూచించారు. తాను విద్యాశాఖ మంత్రిని అయితే కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు బంద్ చేయడం ఖాయమన్నారు. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్ లు, లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్ స్టేడియం లతో 8 కోట్ల నిర్మాణ వ్యయంతో 3 అంతస్తుల్లో ఈ స్కూల్ ను నిర్మించారు. ప్రతీక్ ఫౌండేషన్ నిర్మించిన ప్రభుత్వ స్కూల్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అభివృద్ధి కోసం తాను ఏది అడిగినా సీఎం కాదనరని చెప్పారు. నల్లగొండ కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. పట్టణంలో మరో ఆరు నెలల్లో 24 గంటలు తాగు నీరు అందిస్తానని చెప్పారు. కొడంగల్ కు ఎన్ని నిధులు ఇస్తే తన నియోజకవర్గానికి అన్ని నిధులు ఇవ్వాలని సీఎంను కోరినట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
పూర్య విద్యార్థులు రూపొందించిన సావనీర్ ఆవిష్కరణ 
పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం రూపొందించిన ప్రత్యేక సంచికను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. 1975 బ్యాచ్ నుండి 2012 పదవ తరగతి బ్యాచ్ వరకు పూర్వ విద్యార్థులు పాఠశాల గురించి, పాఠశాలలో అధ్యాపకుల బోధనలు, పాఠశాలలో చదివి ఉన్నత స్థానాలకు ఎదిగిన వారి వివరాలను ఈ 70 పేజీల సంచికలో ప్రచురించారు. మంత్రి కోమటిరెడ్డి సందేశంతో కూడిన ఈ ప్రత్యేక సావనీర్‌ను పాఠశాల పూర్వ విద్యార్థి, సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ సంపాదకత్వంలో వెలువరించారు. ప్రముఖ చిత్రకారుడు పాఠశాల పూర్వ విద్యార్థి కూరెళ్ల శ్రీనివాస్ అందమైన ముఖచిత్రాన్ని ఈ సంచికకు రూపొందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





