కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగ ఉల్లంఘనలు
రాహుల్ గాంధీకి రాజ్యాంగం తెలియదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు
దేశానికి ఏ సంక్షోభం వచ్చినా పరిష్కారం చూపగల జవాబు భారత రాజ్యాంగమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్‌లో బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రామచందర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు ఉల్లంఘించిందని, ఇప్పుడు కూడా అదే చేస్తుందని విమర్శించారు. “రాహుల్ గాంధీ వంటి వారు చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరుగుతుంటారు. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్స్, చాప్టర్స్, నిబంధనలు ఆయనకు తెలియవు. గతంలో ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని హైకోర్టు నిర్ణయించిన ప్పటికీ, అన్యాయంగా ఎమర్జెన్సీ విధించి అనేకమందిని జైల్లో పెట్టారని గుర్తు చేశారు. యూపీఏ హయాంలోనూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను డిస్మిస్ చేసి రాజ్యాంగాన్ని అవహేళన చేశారని ఆరోపించారు.
తప్పుడు ప్రచారం: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల పేరుతో మార్ఫింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేసిందని, దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు నడుస్తోందని అన్నారు. ఓడిపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నైజమన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఎందుకు చదవాలి, గౌరవించాలి అనేది తెలుసుకోవాలని రామచందర్ రావు అన్నారు. “మనకు వాక్ స్వేచ్ఛ ఉంది, దాంతో పాటు రాజ్యాంగాన్ని గౌరవించుకునే బాధ్యత కూడా ఉంది. స్వేచ్ఛ పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా, భరతమాతను కూడా కించపరిచేలా సోషల్ మీడియాలో మాట్లాడకూడదు” అని హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ పాలన కొనసాగిస్తోందని, అంబేద్కర్ స్ఫూర్తిని సముచితంగా గౌరవించిందని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ అంబేద్కర్ గౌరవార్థం ఆయన నడయాడిన ఐదు ముఖ్య ప్రదేశాలను – మధ్యప్రదేశ్ (జన్మ స్థలం), యూకే, లండన్ (నివాసం), నాగ్‌పూర్ (దీక్షా భూమి), ఢిల్లీ (మహాపరినిర్వాణ స్థలం), ముంబై (చైత్య భూమి) పంచ తీర్థాలుగా అభివృద్ధి చేశారని వివరించారు.
ఎన్నికల ఖర్చు తగ్గించేందుకు ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’, దేశ ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గించేందుకు ‘వన్ నేషన్ – వన్ ట్యాక్స్’ (జీఎస్టీ) ప్రవేశపెట్టడం రాజ్యాంగబద్ధ పాలనకు నిదర్శనమన్నారు.





