రాజ్యాంగాన్ని మార్చేందుకు ఎన్డీయే కుట్ర

– దాన్ని నిలబెట్టుకుంటేనే మనందరికీ భవిష్యత్తు
– సామాజిక న్యాయ సూత్రం ఎజెండాగా రాష్ట్రంలో పాలన
– అభివృద్ధిని జీర్ణించుకోలేక బీఆర్‌ఎస్‌, బీజేపీ బురదజల్లే యత్నం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 4: దేశంలో ప్రస్తుతం ఒక సైద్ధాంతిక పోరాటం జరుగుతోంది.. రాజ్యాంగాన్ని రక్షించాలని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని “ఇండియా” ఒక పక్కన, రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ మరో పక్కన పూనుకున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పీసీసీ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ సభలో ఆయన ప్రసంగించారు. గ్రామ శాఖ అధ్యక్షులతో సాక్షాత్తు ఏఐసీసీి అధ్యక్షుడు నేరుగా మాట్లాడేందుకు ఈ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశ ప్రజల ఆలోచనలు, పూజ్య బాపూజీ, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌, పూలే ఆలోచనలను పొందుపరిచి ప్రజల అవసరాల కోసం రూపొందించిన ఒక అద్భుత గ్రంథం రాజ్యాంగం అని తెలిపారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవాన్ని కల్పిస్తూ దేశ సంపద, అవకాశాలు దేశంలోని ప్రజలందరికీ సమానంగా అందాలని కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ అందించిన అద్భుత గ్రంథం రాజ్యాంగం అని చెప్పారు. దాన్ని నిలబెట్టుకుంటేనే మనందరికీ భవిష్యత్తు అని భట్టి తెలిపారు. రాజ్యాంగానికి చిన్న ఇబ్బంది కలిగినా దేశంలోని సామాన్యులు హక్కులు కోల్పోయే పరిస్థితి దాపురిస్తాయని హెచ్చరించారు. ప్రజలందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆ సామాజిక న్యాయ సూత్రాన్ని అమలు చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిందని ఆయన వివరించారు. ప్రతి గ్రామం నుంచి వచ్చిన పార్టీ నేతలు ప్రజా ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. పదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడిరదని, బీజేపీ రాష్ట్ర ప్రజలను పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జీర్ణించుకోలేక అవి అవాకులు చవాకులు పేలుతున్నాయని విమర్శించారు. కొన్ని లెక్కల ద్వారా ఆ రెండు పార్టీలకు సరైన సమాధానం చెప్తామన్నారు. రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటిస్తే అపహాస్యం చేసిన వారికి బుద్ధి చెప్పేలా రాష్ట్ర రైతాంగ సోదరులను రుణ విముక్తులను చేసేందుకు అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు లక్షల కుటుంబాల పక్షాన రూ.21,832 కోట్లు ప్రభుత్వం బ్యాంకర్లకు చెల్లించిందని తెలిపారు. రైతు భరోసా కింద అన్నదాతలకు పెట్టుబడి సాయం కోసం కేవలం తొమ్మిది రోజుల్లో రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. సన్న ధాన్యం సాగు చేసే రైతులకు ప్రోత్సాహకంగా క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ చెల్లించామని, రైతుల ఖాతాలో డబ్బులు వేశామని తెలిపారు. రాష్ట్రంలోని 42 లక్షల మంది రైతాంగ సోదరులకు బీమా కోసం ప్రభుత్వమే రూ.2,181 కోట్లు చెల్లించిందని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే బీఆర్‌ఎస్‌ నేతలు పట్టించుకోలేదని, ప్రజా ప్రభుత్వం రాగానే రూ.260 కోట్లు విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని అన్నారు.

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు కాంగ్రెస్‌ ప్రభుత్వమే తీసుకొచ్చిందని, ఈ పథకం కింద రాష్ట్రంలో 29 లక్షల పంప్‌ సెట్లకు రైతుల పక్షాన ప్రభుత్వం ఇప్పటివరకు రూ.17 వేల కోట్లు విద్యుత్‌ సంస్థలకు చెల్లించిందన్నారు. భూమి లేని నిరుపేద ప్రజానీకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద యేటా రూ.12,000 వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. చేయూత పథకం కింద వివిధ రకాల పెన్షన్‌ దారులు 43 లక్షల మందికి ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం రూ.17,958 చెల్లించిందని, ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలన్న ఆలోచనతో రూ.5 లక్షలు వెచ్చించి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ వాడుకునే గృహజ్యోతి పథకంతో ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని 80% మందికి కరెంటు బిల్లు కట్టే పని లేకుండా పోయిందని, ఈ పథకం కింద పేదల పక్షాన ప్రభుత్వం రూ.2,110 కోట్లు విద్యుత్‌ సంస్థలకు చెల్లించిందని డిప్యూటీ సీఎం వివరించారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ కోసం ప్రభుత్వం రూ.641 కోట్లు పేదల పక్షాన గ్యాస్‌ సంస్థలకు చెల్లించిందన్నారు. పేదలు, బలహీన వర్గాలు అనారోగ్యానికి గురైతే వైద్యం అందక ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ రూ.5లక్షల పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని, ఈ పథకం కింద 93 లక్షల కుటుంబాలకు ఉచితంగా వైద్య సహాయం అందుతోందని తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వడ్డీ లేని రుణాలను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి ఏడాది రూ.21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రేషన్‌ దుకాణా ద్వారా సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుండగా రూ.13,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్యనందించేందుకు రాష్ట్రంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ప్రారంభిస్తున్నామని, ఒకేసారి 105 స్కూల్స్‌ మంజూరు చేశామని, రాష్ట్ర చరిత్రలో ఏనాడూ ఇలాంటిది జరగలేదని తెలిపారు. అటవీ హక్కుల చట్టం కింద రాష్ట్రంలోని పేద గిరిజనులకు 6.70 లక్షల ఎకరాలను నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పంపిణీ చేయగా ఆ భూములన్నిటినీ సాగులోకి తెచ్చేందుకు ఇందిరా సౌర గిరిజన వికాస పథకం కింద రూ.12,500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించిన ఈ పథకం కింద గిరిజన రైతులకు సోలార్‌ పంప్‌ సెట్లు, డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు సాగు చేసేందుకు మొత్తం ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *