– భారీగా పేలుడు పదార్థాలు సిద్దం చేస్తున్న ఉగ్రవాదులు
– ఎర్రకోట పేలుడుతో తవ్వుతున్నకొద్దీ సంచలన విషయాలు వెల్లడి
న్యూదిల్లీ, నవంబర్ 12:ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనక పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న జైషే మహ్మద్ ఉగ్ర ముఠా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దిల్లీలో వరుస పేలుళ్ల కోసం ఉగ్రవాదులు జనవరి నుంచి పథక రచన చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. 26/11 ముంబయి దాడుల తరహాలో దేశ రాజధానిలో వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీరి టార్గెట్ లిస్ట్‌లో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ వంటి ఇతర ప్రముఖ కట్టడాలు ఉన్నట్లు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ జాతీయ డియా కథనాలు వెల్లడించాయి. ఇందుకోసం భారీగా బాంబులను కూడా తయారుచేస్తున్నట్లు పేర్కొన్నాయి. దిల్లీ పేలుడు కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇందుకోసం 10 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసింది. జమ్మూకశ్మీర్, దిల్లీ, హరియాణా పోలీసుల నుంచి కేసు డైరీలను తీసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతోంది. నిందితుల కార్యకలాపాలు, వారికి అందిన ఆర్థిక సహకారం గురించి ఆరా తీస్తోంది. ఇందులోభాగంగానే పలు అనుమానితులు, నిందితులను విచారించి వారి నుంచి కూపీ లాగుతున్నారు. ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తిమంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. దిల్లీలోని ఎర్రకోట, ఇండియా గేట్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వేస్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు పాల్పడాలని వీరు కుట్ర పన్నుతున్నట్లు తెలిపాయి. ఈ టెర్రర్ మాడ్యూల్‌పై ఇటీవల జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్‌తో కూడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక, దిల్లీలో పేలుడు జరిగిన ప్రాంతం నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. ఇందులో కూడా అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లతో పాటు అత్యంత శక్తిమంతమైన మరో పేలుడు పదార్థం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
అక్టోబర్29న కారును కొన్న డాక్టర్ నబీ.. 11 రోజులుగా అండర్ గ్రౌండ్‌లో
పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఎర్రకోటకు అతి సపంలో పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ నబీ.. బ్లాస్ట్‌కు పది రోజుల ముందు కొనుగోలు చేశాడని దర్యాప్తు చేస్తున్న వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ 29న దానిని కొనుగోలు చేసిన అతడు.. వెంటనే దానికి కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత అతడు అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయాడని, అప్పటినుంచి కారు ఎక్కడ ఉందో కచ్చితంగా తెలియడం లేదు. సోషల్ డియాలో మాత్రం అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం వద్ద ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, ఫరీదాబాద్ పోలీసుల వాదన దీనికి భిన్నంగా ఉంది. కారు గత 10-11 రోజులుగా అక్కడలేదని వారు చెబుతున్నారు. ఇక కాలుష్య నియంత్రణ ధ్రువీకరణపత్రం తీసుకునే సమయంలో ముగ్గురు వ్యక్తులు కారు నుంచి బయటకు వొచ్చారు. వారు ఎవరనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు, వరుసగా తన సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆందోళనకు గురైన ఉమర్ నవంబర్ 10న ఆ కారు తీసుకొని, దిల్లీ వైపు వెళ్లాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సహా పలు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి. దీనిలో భాగంగా కారు యజమాని సల్మాన్‌ను గురుగ్రామ్‌లో ఇప్పటికే అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 2014, మార్చి 18న సల్మాన్ పేరిట దీనిని కొనుగోలు చేశారు. తర్వాత అతడు దానిని దేవేంద్ర అనే వ్యక్తికి అమ్మేశాడు. అనంతరం సోనుకు.. అక్కడి నుంచి పుల్వామాకు చెందిన తారిక్ చేతికి చేరింది. ఈ వాహనం పలువురు చేతులు మారినా.. యాజమాన్య బదిలీకి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకపోవడం గమనార్హం. కొనుగోళ్లు, విక్రయాల సమయంలో నకిలీ పత్రాలను ఉపయోగించారని తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





