వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్ప‌డం ఖాయం

– రెండేళ్ల‌లో ఏ  ప‌ట్ట‌ణానికీ రూపాయి ఇవ్వ‌ని ప్ర‌భుత్వం
– ప‌ట్ట‌ణాల్లో ప‌డ‌కేసిన పాల‌న‌
– శిలాఫ‌ల‌కాలు త‌ప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు
– నిధులు లేక ఆగిపోయిన కార్య‌క్ర‌మాలు
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి10: రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని రెండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిపోతుందన్నారు. కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలనలో పట్టణాల్లో పరిపాలన పూర్తిగా పడకేసిందని…పారిశుద్ధ్య నుంచి మొదలుకొని ప్రతి అంశంలో పట్టణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన అభివృద్ధి కార్యక్రమాలకు మరోసారి శిలాఫలకాలు వేయడం తప్పించి…ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని ఒకటి లేదు అన్నారు. గత ప్రభుత్వం ప్రారంభించిన అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్, మోడల్ మార్కెట్ల వంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి నిధులు ఆపివేయడంతో అన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను వ్యవసాయనం గాని సంక్షోభంలోకి నేడుతూ…మరోవైపు పట్టణాలను పడుకోబెట్టి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో ఆయా పట్టణాలకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను… ఇచ్చిన నిధులను వివరించి ఓట్లు అడగాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు కేటీఆర్ సవాలు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ ఖమ్మం జిల్లా నేతలతో కేటీఆర్ సన్నహక సమావేశం నిర్వహించారు. ఈరోజు హైదరాబాదులో జరిగిన నిజామాబాద్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నేతల సమావేశంలో పార్టీ నేతలకు కేటీఆర్ పురపాలక ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాల పైన దిశా నిర్దేశం చేశారు. మునిసిపల్ ఎన్నికల కు సంబంధించి పార్టీ తరఫున చేసుకోవాల్సిన ఏర్పాట్లను…ప్రజల ముందు ఉంచాల్సిన వివిధ అంశాలను కేటీఆర్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు తెలియజేశారు. రెండు జిల్లాలకు సంబంధించిన ప్రతి మున్సిపాలిటీలోని క్షేత్రస్థాయి పరిస్థితుల పైన క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలను అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని మంచి ఫలితాలు సాధించామని ఇదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోను మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.  జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రజాప్రతినిధులు పార్టీ సీనియర్ నాయకులు హాజరైన ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నేత శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కూడా పలు అంశాల పైన నేతలకు దిశా నిర్దేశం చేశారు. కలిసికట్టుగా సమిష్టిగా కొట్లాడి ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేయాలని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన పలు అంశాలను హరీష్ రావు నేతలకు వివరించారు. ఈ సమావేశాల సందర్భంగా ఆయా జిల్లాల నేతలు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పార్టీ సీనియర్ నేతలకు వివరించారు. ప్రభుత్వం పైన క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నదని… పార్టీకి అనుకూల వాతావరణ ఉన్నదని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *