– అభ్యర్థి నవీన్ యాదవ్ తీరుపై బీఆర్ఎస్ మండిపాటు
– ఈ బెదరింపులు దేనికి సంకేతమన్న బాల్క సుమన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపులు దేనికి సంకేతమని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. పట్టపగలే హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో చిన్న అవాంఛనీయ ఘటన జరగలేదని తెలిపారు. శాంతిభద్రతలు కఠినంగా అమలు చేశారని తెలిపారు. దీనివల్ల హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరించిందన్నారు. కేసీఆర్ పాలనలో పారిశ్రామికరంగం, రియల్ ఎస్టేట్ రంగం పురోభివృద్ధి చెందాయని తెలిపారు. కేసీఆర్ పాలనలో పెట్టుబడులకు తెలంగాణ గేట్‌వే ఆఫ్ ఇండియాగా ఉంటే కాంగ్రెస్ పాలనలో గన్ కల్చర్‌కు అడ్డాగా మారిందని సుమన్ విమర్శించారు. జూబ్లీహిల్స్ అనేది సంగమం లాంటి నియోజకవర్గమని సుమన్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకోవాలని సూచించారు. కేసీఆర్ నాయకత్వం హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పాలనలో తిరోగమన దిశగా కొనసాగుతోందని సుమన్ విమర్శించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదన్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగడం లేదని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అన్నారని, ఒక్క గ్యారంటీ కూడా అమలుకు నోచుకోలేదని, రైతు డిక్లరేషన్ అన్నారని.. రైతులకు ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు. రేవంత్ పాలనను గాలికి వదిలేశారని, మంత్రివర్గం మొత్తం జూబ్లీహిల్స్‌లో దిగిందని, జూబ్లీహిల్స్‌ను రణరంగంగా మార్చేశారని ఆరోపించారు. ఆడబిడ్డ కన్నీళ్లపై డ్రామా అని మంత్రులు మాట్లాడుతున్నారని, గోపీనాథ్ కూతుళ్లు ప్రచారం చేస్తే వాళ్లపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





