– జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అక్రమాలు
– ఎన్నికల సంఘానికి కెటిఆర్ ఫిర్యాదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 13: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ నేతలు ప్రలోభపెడుతున్నారని, వోటర్లను భయపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు కాంగ్రెస్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ నేతలు పెద్ద కుట్రకు తెరలేపారని ఆక్షేపించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వోటు చోరీ అవుతోందని అంటుంటే జూబ్లీహిల్స్‌లో మాత్రం కాంగ్రెస్ నేతలే వోటు చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో 20 వేల దొంగ వోట్లని సృష్టించారని ఫైర్ అయ్యారు. ఆధారాలతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశానని తెలిపారు. కొవ్వూరి కార్తీక్ పేరుతో మూడు చోట్ల వోట్లు ఉన్నాయని.. దీపక్ శర్మ అనే వ్యక్తికి రెండుచోట్ల వోట్లు ఉన్నాయని ఆరోపించారు. కిందిస్థాయి అధికారులు కాంగ్రెస్‌తో కుమ్మక్కై దొంగ వోట్లను సృష్టించారని మండిపడ్డారు. దొంగ వోట్లపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కైన కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ పక్రియ పూర్తి అయ్యేలోపు 20 వేల దొంగ వోట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా ఉప ఎన్నిక జరగాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



