– రాజకీయ లాభాల కోసం దేశాన్ని చిన్నబుచ్చే యత్నం
– అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠకు భంగం
– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: దేశం గ్లోబల్ టెక్నాలజీ శక్తిగా ఎదుగుతున్న సమయంలో జరిగిన అంతర్జాతీయస్థాయి ఏఐ సమ్మిట్ ను కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించారని కేంద్ర మంత్రి జి.కిషడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా నిలిచిన ఈ సమ్మిట్ లో కాంగ్రెస్ నాయకులు అల్లర్లు సృ ష్టించడం దురదృష్టకరమని అన్నారు. సమ్మిట్ లో వినూత్న ఆవిష్కరణలు, గిన్నిస్ వరల్డ్ రికార్డులు వంటి అంశాలు దేశ ప్రతిష్ఠను పెంచాయని, అదే సమయంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన పేరుతో అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం దేశ ప్రతిష్టను దెబ్బతీసిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు సహజమే అయినప్పటికీ ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమంలో దేశ గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ వేదికపై దేశాన్ని చిన్నబుచ్చడం తగదని, కాంగ్రెస్ నాయకులు అలాంటి బాధ్యతారాహిత్య చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. దేశాభివృద్ధిని ప్రతిబింబించే కార్యక్రమాల్లో హుందాతనం ప్రదర్శించాల్సిందిపోయి రచ్చ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతీసారి భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, పౌర హక్కులు ఉల్లంఘించబడుతున్నాయని ఆరోపిస్తూ దేశ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. సమ్మిట్ సందర్భంగా జరిగిన సంఘటన కాంగ్రెస్ లో నెలకొన్న నిరాశ, నిస్పృహకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం తప్పులు చేస్తే విమర్శించవచ్చని, కానీ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. దేశంలో భారీ పెట్టుబడులు రావడానికి దోహదపడే సమ్మిట్ ను అడ్డుకోవడం దురదృష్టకరమని, దేశం అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



