తప్పుడు విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్‌

– బీఆర్‌ఎస్‌లో హెచ్‌వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్‌ఖాన్‌ చేరిక
– కేసీఆర్‌ వంటి సెక్యులర్‌ లీడర్‌ దేశంలో ఎవరూ లేరు :కేటీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23: హైదరాబాద్‌ యూత్‌ కరేజ్‌ (హెచ్‌వైసీ) వ్యవస్థాపకుడు, సామాజిక కార్యకర్త సల్మాన్‌ ఖాన్‌ తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్‌ వంటి సెక్యులర్‌ లీడర్‌ దేశంలో ఎవరూ లేరని ప్రశంసించారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా కేబినెట్‌లో ముస్లిం మంత్రి కానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కానీ లేరని విమర్శించారు. షబ్బీర్‌ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని ఎందుకు చేయలేదని నిలదీశారు. మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ బస్సు చార్జీలు పెంచారని విమర్శించారు. కాంగ్రెస్‌ హామీలతో ముస్లింలు మోసపోయారన్నారు. బీహార్‌లో ముస్లింలు మోసపోయారని రాహుల్‌గాంధీ అంటున్నారని, మరి తెలంగాణ పరిస్థితి ఏంటని నిలదీశారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను కూడా రేవంత్‌ మోసం చేశారని కేటీఆర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో బుల్డోజర్‌ రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. రాహుల్‌ గాంధీ గుజరాత్‌ మోడల్‌ బేకార్‌ అంటారు.. కానీ రేవంత్‌రెడ్డి గుజరాత్‌ మోడల్‌ను ఫాలో అవుతున్నారని విమర్శించారు. ఇక్కడ కారు.. అక్కడ బేకార్‌ రేవంత్‌రెడ్డి ఉన్నారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రియల్‌ ఎస్టేట్‌ కుప్పకూలిందని ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ముస్లింలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ ఉప ఎన్నికలో తన నామినేషన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా అడ్డుకుందని ఆరోపించారు. తనను పోటీకి దూరంగా ఉంచేందుకు పయత్నాలు చేశారని, తనను కొనేందుకు పెద్దపెద్ద నాయకులు విశ్వప్రయత్నం చేశారని, ఏమి కావాలంటే అది చేసి పెడతామని ఆశ చూపారని వెల్లడిరచారు. తాను అమ్ముడుపోయేవాడిని కాదని కాంగ్రెస్‌ నేతలకు స్పష్టం చేసి కేటీఆర్‌ను కలిశానని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన యోధుల పార్టీలోనే చేరాలని తన అభిమానులు సూచించారని చెప్పారు. ముస్లింల ఓట్లు దండుకుని వారిని ధోకా చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని, ముస్లిం నాయకులను కుట్రపూరితంగా ఎదగనివ్వడం లేదని ఆరోపించారు. సెక్యులర్‌ విలువలను రేవంత్‌ రెడ్డి మంట గలుపుతున్నారని, గంగా జమునా తెహజీబ్‌ను కాపాడిన నాయకులు కేసీఆర్‌, కేటీఆర్‌ అని కొనియాడారు. ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమైపోయిందని, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సేనంటూ రాష్ట్రం అంతటా గులాబీ జెండా ఎగిరేలా హెచ్‌వైసీ సంస్థ కృషి చేస్తుందని సల్మాన్‌ ఖాన్‌ హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *