విభేదాలకు కారణమవుతున్న కాంగ్రెస్, ఎంఐఎం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

నిర్మల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ముస్లిం సమాజాన్ని రెచ్చగొడుతూ సమాజంలో విభజనలు, విధ్వంసానికి కారణమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నదే వారి లక్ష్యమన్నారు. మున్పిపల్ ఎన్నికల సందర్భంగా నిర్మల్‌లో సోమవారం జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తో మజ్లిస్ పార్టీ కాపురం చేస్తోందని, గతంలో ఇదే మజ్లిస్ బీఆర్ఎస్‌తో కాపురం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రజాసమస్యలు, అభివృద్ధిపై వారికి ధ్యాసలేదన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్-ఎంఐఎంలు అంతర్గతంగా కుమ్మక్కై పనిచేస్తున్నాయని, ప్రజలు ఈ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమ భవిష్యత్తు కోసం, రాష్ట్రం, దేశ భవిష్యత్తు కోసం బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో నిజమైన అభివృద్ధి కావాలంటే బీజేపీ గెలవాల్సిందేనన్నారు. అభివృద్ధికి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని, మున్సిపాలిటీల్లో రోడ్ల నిర్మాణం, పేదలకు 5 కిలోల ఉచిత రేషన్, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీల నిర్మాణం, శ్మశానవాటికల అభివృద్ధి వంటి అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలో ఉంటేనే అవినీతిరహిత పాలన అందుతుందన్నారు. నిర్మల్ ప్రజల సమస్యలను పరిష్కరించి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. సేవ్ తెలంగాణ – ఓట్ ఫర్ బీజేపీ అనిపిలుపునిచ్చారు.. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలేనని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు.. రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వడం లేదు.. రైతులకు రైతుబంధు లేదు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంతోపాటు ఇతర విశ్వవిద్యాలయాల్లో సరిపడా ప్రొఫెసర్లు లేరు.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు.. ఇవన్నీ బీఆరఎస్-కాంగ్రెస్ పాలన వైఫల్యాలేనని దుయ్యబట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *