రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ చేసింది శూన్యం

– ఒక్క హామీనీ అమలు చేయలేదు
– మెదక్ పర్యటన అంటే వణుకుతున్న రేవంత్
– దుబ్బాక ప్రచారంలో ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9: రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఇక్కడ హరీశ్‌రావు ఉన్నాడని, హామీలు, గ్యారంటీలు, గారడీలపై మెదక్ ప్రజలు నిలదీస్తారని ఇక్కడికి రావాలంటే రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలోని చెల్లాపూర్ వార్డులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌ను రేవంత్ తిడుతున్నాడని, ప్రత్యేక రాష్ట్రం తెచ్చి అభివద్ధి పథకాలు అమలు చేయడం కేసీఆర్ తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిడితే ఓట్లు రావని పథకాలు అమలు చేస్తే వస్తాయని హితవుపలికారు. బూతులు మాట్లాడే రేవంత్‌కు పోలింగ్ బూత్‌లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మెదక్‌లో రేవంత్ రెడ్డి ఒక్క వార్డులో కూడా గెలవడని తెలిపారు. జాబ్ క్యాలెండర్ లేదు కానీ స్కామ్ క్యాలెండర్ అయితే రేవంత్ ఇచ్చిండని విమర్శించారు. ప్రతి నెలా ఏదో ఒక కుంభకోణానికి పాల్పడ్డాడని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి సురుకుపెట్టాలని కోరారు. దుబ్బాక ఓటర్ల దెబ్బకు రేవంత్ రెడ్డికి దిమ్మ తిరగాలన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభివద్ధి చేస్తే చూపించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. డబ్బులు పంచి గెలవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడంటూ కేసీఆర్ పథకాలు, అభివద్ధితో పోలిస్తే ఈ డబ్బులు ఎంత అని ప్రశ్నించారు. దుబ్బాకలో బడి కట్టింది.. గుడి కట్టింది.. ఆస్పత్రి కట్టింది కేసీఆర్ అని గుర్తుచేశారు. రెండేళ్లలో వచ్చేది బీఆరఎస్ ప్రభుత్వమేనని, దుబ్బాకను ఇంకా అభివద్ధి చేసే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో భూముల విలువ పెరిగితే రేవంత్ రెడ్డి వచ్చాక భూముల ధరలు తగ్గడమే కాదు.. రాష్ట్ర ప్రతిష్ట కూడా దిగజారిందని తెలొపారు. రేవంత్ రెడ్డి చేతిలో మోసపోని మనిషే లేడన్నారు. తెలంగాణ భవిష్యత్ గురించి ఆలోచించి కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డికి చురుకు తగిలితేనే పథకాలు అమలవుతాయని హరీష్‌రావు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *