రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌గూండాగిరి

– సోమార్‌పేట్‌ ‌గ్రామ ఘటనపై కెటిఆర్‌ ఆ‌గ్రహం
– తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 15:  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, ఆ పార్టీ నాయకుల గూండాగిరి రోజురోజుకూ శృతిమించుతోందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన అమానుష ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. సర్పంచ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ ‌నేతలు భౌతిక దాడులకు తెగబడటం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. సోమార్‌పేట్‌ ‌గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామంలో బీఆర్‌ఎస్‌ ‌తరపున సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బిట్ల బాలరాజు ఫలితాల తర్వాత తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి స్థానిక మండల అధ్యక్షుడు సాయిబాబా ట్రాక్టర్‌తో అక్కడకు వచ్చి బీభత్సం సృష్టించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలో ఉంది.. నన్ను ఎవరూ ఏం చేయలేరు అంటూ విర్రవీగుతూ నిల్చున్న వారిపైకి ట్రాక్టర్‌ ఎక్కించారు. ఈ దాడిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాలరాజుతో పాటు ఆయన అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న వెంటనే కేటీఆర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు ఫోన్‌ ‌చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. గాయపడిన బీఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. పార్టీ వారికి అండగా ఉంటుందని, అధైర్య పడవద్దని భరోసా కల్పించారు. అనంతరం కామారెడ్డి జిల్లా ఎస్పీకి కేటీఆర్‌ ‌ఫోన్‌ ‌చేసి సోమార్‌పేట్‌ ‌ఘటనను వివరించి బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అధికారం ఉంది కదా అని కాంగ్రెస్‌ ‌నేతలు హత్యాయత్నాలకు పాల్పడుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారేమని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్‌ ‌కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని, ప్రజలు, కార్యకర్తలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని కేటీఆర్‌ ‌హెచ్చరించారు. చట్టం తన పని తాను చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. గాడి తప్పిన కాంగ్రెస్‌ ‌నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులదే అని ఆయన అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *