ప్రజలలో కాంగ్రెస్‌ నైజాన్ని ఎండగట్టాలి

– పార్టీ బలోపేతానికి సమన్వయంతో పనిచేయాలి
– ఉప ఎన్నికలో లంక‌ల గెలుపు ఖాయం
– పదాధికారుల సమావేశంలో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 29: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేయాలని పార్టీ రథసారధి రాంచందర్‌ రావు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను గడపగడపకు చేరేలా ప్రచారం ముమ్మరం చేయాలని సూచించారు. పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన పార్టీ పదాధికారుల సమావేశం బుధవాం జరిగింది. ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలోని అవినీతి, అరాచకాలను, అలాగే ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు హామీలు, అమలు కాని ఆరు గ్యారంటీలను ప్రజల ముందు బహిర్గతం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ సమావేశంలో రాబోయే కాలంలో పార్టీ బలోపేతం, విస్తరణకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి విస్తరించడం ఇక్కడి నాయకులు, కార్యకర్తలపై జాతీయ పార్టీ బలమైన నమ్మకాన్ని ఉంచిందని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో పార్టీని ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాల ప్రయోజనాల గురించి క్షేత్రస్థాయిలో తెలియజేయాలన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పార్టీకి అనుకూల వాతావరణం ఉందంటూ పార్టీ అభ్యర్థి గెలుస్తారనే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఇప్పటికే మర్చిపోయారన్నారు. వచ్చే నెల 11న జూబ్లీహిల్స్‌లో జరగబోయే ఉపఎన్నిక సందర్భంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నాయని, పోటీ ఎంఐఎం-బీజేపీ మధ్యే జరుగుతోందని, కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే అది ఎంఐఎంకు వేసినట్లేనని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీకి తగిన అభ్యర్థులు లేరని, గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన అభ్యర్థిని ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయిస్తోందని ఎద్దేవా చేశారు. పోలీస్‌ స్టేషన్లలో బైండోవర్‌ అయ్యే కాంగ్రెస్‌ అభ్యర్థి కావాలా లేక ప్రజల మధ్య తిరిగే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం పనిచేసే బీజేపీ అభ్యర్థి కావాలా ప్రజలు తేల్చుకోవాలని రామచందర్‌రావు పిలుపునిచ్చారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌ రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page