ఇంటింటా కాంగ్రెస్‌ బాకీ కార్డులు పంపిణీ చేయాలి

– ప్రతి రైతుకూ రూ.75 వేలు రైతుబంధు బాకీ
– ప్రతి మహిళకూ రూ.44 వేల బాకీ చెల్లించి ఓట్లు అడగాలి
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూపాయి కూడా చెల్లించలేదు
– కాంగ్రెస్‌ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్‌

సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 30: కాంగ్రెస్‌ మోసాలను, ఆ పార్టీ పాలనను ఎండగట్టాలని, ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరగాలని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. కాంగ్రెస్‌ బాకీ కార్డులను మంగళవారం ఆయన సిద్దిపేటలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోయిన వానకాలం రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టిండు. పోయిన యాసంగిలో మూడెకరాల వారికి ఇచ్చి మిగతా వాళ్లందరికీ ఎగ్గొట్టిండు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలున్నాయని రూ.12,000 ఇచ్చిండు. మిగతా రూ.3 వేలు ఎగ్గొట్టిండు. ప్రతి రైతుకూ కాంగ్రెస్‌ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ పడిరది. రైతుబంధు రైతుకు ఇస్తాం. కౌలు రైతుకీ ఇస్తామన్నారు. రూపాయి అయినా కౌలు రైతుకు ఇచ్చారా అని ప్రశ్నించారు. కరోనా వచ్చినా కేసీఆర్‌ ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు బంద్‌ పెట్టిండు గాని రైతులకు రైతుబంధు ఆపలేదన్నారు. 25 ఎకరాల పై భూమి ఎంతమందికి ఉంది అని లెక్క తీస్తే మూడు శాతం మాత్రమే ఉన్నారు. 97 శాతం మంది రైతులు 10 ఎకరాల లోపే ఉన్నారు. కుర్చీలో కూర్చుంటే కేసీఆర్‌ చేసింది కరెక్ట్‌ అని రేవంత్‌ రెడ్డికి అర్థమైంది. కాంగ్రెస్‌ రూ.4000 పెన్షన్‌ ఇస్తా అని ఈరోజు వరకు లేదు. రేవంత్‌ రెడ్డివి అన్నీ గజినీకాంత్‌ మాటలు.. ఇంటికొక మహిళకు రేవంత్‌ రెడ్డి రూ.44వేలు బాకీ పడిరడు. ఆ సొమ్ము ఇచ్చినంకనే కాంగ్రెస్‌ వాళ్ళు ఎవరైనా ఓటు అడగాలి. వంద రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా ఇప్పటివరకు ఒక్క హామీ నెరవేర్చలేదు. మొదటి కేబినెట్‌లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తామన్నారు.. 30 కేబినెట్‌ లైనా ఊసే లేదు. హామీల అమలు గురించి అడుగుతారేమో అని రాహుల్‌ గాంధీ తెలంగాణ ముఖం చూడట్లేదు. రేవంత్‌ రెడ్డిని ఎవడు నమ్మేటట్టు లేడని రాహుల్‌ గాంధీ వచ్చి మాటిచ్చాడు. అందుకే ఈ బాకీ కార్డును విడుదల చేశాం. 18 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు. చెల్లెకు మహాలక్ష్మి కింద రూ.2,500 ఇస్తామన్నారు. మహిళలను కోటీశ్వరులని చేస్తామంటారు.. ఎవరైనా అయ్యారా.. యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు.. తులం బంగారం ఏమైంది రేవంత్‌ రెడ్డి? కనీసం కల్యాణ లక్ష్మి చెక్కుల పైసలు ఇస్తలేవు. రూ.5 లక్షల భరోసా కార్డు ఒక్క విద్యార్థికైనా ఇచ్చారా. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావ్‌ కనీసం 5000 ఉద్యోగాలను ఇచ్చేవా రేవంత్‌ రెడ్డి. కేసీఆర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్ష పెట్టి రిజల్ట్‌ ఇస్తే కాయితాలు పంచి నీ ఖాతాలో వేసుకున్నావు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్‌ గాంధీ అశోక్‌ నగర్‌ చౌరస్తాలో చెప్పిండు. నిజమే అని నిరుద్యోగ యువతీయువకులు నమ్మారు. రాహుల్‌ గాంధీ మోసం చేశారు. ప్రియాంక గాంధీ హుస్నాబాదులో నిరుద్యోగ భృతి రూ.4000 ఇస్తామన్నారు ఇచ్చారా. జాబ్‌ క్యాలెండర్‌ జాబ్‌ లెస్‌ కేలండర్‌ అయింది. 2లక్షల ఉద్యోగాలు భర్తీ లేకుండా పోయాయి. కేసీఆర్‌ కిట్లు బంద్‌ అయ్యాయి.. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బంద్‌ అయింది. విద్యార్థులను నిర్లక్ష్యం చేసి రూపాయి ఇయ్యని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ఫీజులు కట్టకపోతే సర్టిఫికెట్లు లేని పరిస్థితి వచ్చింది. చదువు చెప్పే సార్లకు జీతాలు లేవు. సగం కాలేజీలు మూతపడే విద్యా దానం చేసిండు రేవంత్‌ రెడ్డి. ఆరోగ్యశ్రీ డబ్బులు ఈయక దవఖానాలో సేవలు బంద్‌ అయినాయి. కనీసం కేసీఆర్‌ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్‌ కూడా పోయలేకపోతున్నాడు రేవంత్‌ రెడ్డి.. గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంక బిందెలకు వేట పట్టిండు రేవంత్‌ రెడ్డి. కంచ గచ్చిబౌలిలో, బంజారా హిల్స్‌లో, జూబ్లీహిల్స్‌లో భూముల అమ్ముతా అని బయలుదేరిండు.. కేసీఆర్‌ ఉండంగ ఎట్లుండే తెలంగాణ, రేవంత్‌ రెడ్డి పాలనలో ఎట్లయింది తెలంగాణ.. మార్పు మార్పు అన్నాడు.. ఏమైనా మార్పు వచ్చిందా.. నమ్మించి ఏమార్చి గొంతు కోసిండు రేవంత్‌ రెడ్డి.. నీళ్ల విషయంలో అబద్ధాలు, నియామకాల విషయంలో అబద్ధాలు, నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడిరది? ఒక్కో మహిళకు, ఒక్కో రైతుకు ఎంత బాకీ పడిరది.. ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నాం.. సిద్దిపేట నియోజకవర్గంలో గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్‌ నాయకులు అందరూ కలిసి రేపు ప్రతి ఇంటికీ పోయి ఈ బాకీ కార్డుని అందజేసి కాంగ్రెస్‌ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడిరదో వివరించాలని పిలుపునిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *