– ఖమ్మం, భద్రాద్రి జిల్లాల చైర్మన్ రేస్‌లో ఆశావాహులు
– క్యాంపుల నుంచి నేరుగా మున్సిపాల్టీలకు
ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నగరపాలక సంస్థతోపాటు ఏడు మున్సిపాలిటీల్లో మేయర్, చైర్మన్ పదవుల కోసం పోటాపోటి నెలకొంది. ఆశావహులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆశీస్సులతోపాటు ఆయా మున్సిపాల్టీ పరిధిలోని ఎమ్మెల్యేలు రాగమయి, కనకయ్య, ఆదినారాయణలతో లాబీయింగ్ జరుపుతున్నారు. విజేతలైన తర్వాత వారంతా వేర్వేరు ప్రాంతాల్లో క్యాంపుల్లో ఉన్నారు. ఆయా పురపాలక కార్యాలయాలకు సోమవారం ఉదయం నేరుగా హాజరుకానున్నారు. వారి ప్రమాణ స్వీకారం అనంతరం ఛైర్మన్, ఉప ఛైర్మన్ ను ఎన్నుకోనున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస, సీపీఐల మధ్య పరస్పర ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. మొదటి రెండున్నరేళ్లు సీపీఐకి మేయర్, కాంగ్రెస్ కు డిప్యూటీ మేయర్, చివరి రెండున్నరేళ్లు కాంగ్రెస్ కు మేయర్, సీపీఐకి డిప్యూటీ మేయర్ పదవులు పంచుకునే విధంగా అంగీకారం కుదిరింది. దీంతో సీపీఐకి మేయర్ పదవి దక్కనుంది. గిరిజనులకు రిజర్వు అయిన పదవికి ఈ పార్టీ నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికైన ఇద్దరు మహిళలు సహా ముగ్గురు పరిశీలనలో ఉన్నప్పటికీ ఓ అభ్యర్థి పేరును మేయర్ పదవికి ఖరారు చేస్తూ ఆ పార్టీ దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని ఏడు మున్సిపాలిటీల్లో పాలక పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన బలాన్ని కాంగ్రెస్ పార్టీ సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్ రేసులో ఆశావాహులు ఈ విధంగా ఉన్నారు.
కొత్తగూడెం మేయర్: మూడ్ గణేష్(సీపీఐ) సుజాతనగర్ 20 వార్డు డివిజన్ కార్పొరేటర్. వివాదరహితుడు, సౌమ్యుడుగా పేరుంది. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలతో కొత్తగా ఏర్పాటు చేసిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కానున్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్లు/చైర్మన్
ఏదులాపురం: ఛైర్ పర్సన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఈ పదవికి గొడ్డ గొర్ల కృష్ణకుమారి(17వ వార్డు), పోకబత్తిన అనిత(23వ వార్డు), కందకూరి శేషమ్మ(9వ వార్డు), సునీత కోటమర్తి(20 వార్డు) పోటీలో ఉన్నారు.
సత్తుపల్లి: జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. మాజీ వైస్ ఛైర్ పర్సన్ తోట సుజలరాణి(6వ వార్డు), ఎమ్మెల్యే మట్టా రాగమయి ముఖ్య అనుచరుడు కమల్ పాషా భార్య ఎండీ రెహానాబేగం(22వ వార్డు), మట్టా దయానంద్ సోదరి మట్టా దేవజ్యోతి(10వ వార్డు), సీనియర్ నాయకుడు వేణు భార్య బొంతు సుమలత (3వ వార్డు) పేర్లు వినిపిస్తున్నాయి.
వైరా: ఛైర్ పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ సతీమణి ఉమాదేవి(3వ వార్డు), డాక్టర్ కాపా చంద్రకళ(6వ వార్డు) పోటీ పడుతున్నారు.
మధిర: ఛైర్ పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఈ పదవిని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస్ భార్య లక్ష్మీతులసి (6వ వార్డు), కాంగ్రెస్ నాయకుడు సామినేని నాథం భార్య సుజాత(4వ వార్డు), వ్యాపారవేత్త రంగ శ్రీను భార్య రూప(21వ వార్డు) ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి ఆశీర్వాదం ఉన్న వారు ఛైర్ పర్సన్ కానున్నారు.
కల్లూరు: ఛైర్మన్ ఎస్టీ జనరల్ కు రిజర్వ్ అయ్యింది. ధరావత్ మోహన్ (7వ వార్డు), బానోత్ మారోని (6వ వార్డు), భూక్యా రాంబాయి (4వ వార్డు) పోటీ పడుతున్నారు.
ఇల్లెందు: ఛైర్ పర్సన్ బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన కొండపల్లి గణేశ్ భార్య, మాజీ కౌన్సిలర్ సరిత(23వ వార్డు), సీనియర్ నాయకుడు రవిశంకర్ భార్య రేఖ స్వరూప(8వ వార్డు), సీనియర్ నేత చిల్లా శ్రీనివాస్ భార్య విజయభారతి (5వ వార్డు), పార్టీ పట్టణాధ్యక్షుడు దానియేలు భార్య దొడ్డ కిరణ్ మిత్ర(2వ వార్డు) పదవిని ఆశిస్తున్నారు.
అశ్వారావుపేట: ఛైర్ పర్సన్ జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. జూపల్లి రమేశ్(13 వార్డు), శశికళ(6 వార్డు) దంపతులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. శశికళని ఛైర్పర్సన్ పదవి వరించే అవకాశముందని సమాచారం. మంత్రి పొంగులేటికి రమేశ్ ముఖ్య అనుచరుడు.
కాంగ్రెస్ విప్ జారీ
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల చైర్మన్/ఛైర్ పర్సన్ ల, వైస్ చైర్మన్ ల ఎన్నిక నిమిత్తం విప్ లను టిపిసిసి అద్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియమించినారని జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా విజయకేతనం ఎగురవేసిన సందర్భంగా ఏదులాపురం మున్సిపాలిటీ విప్ గా జిల్లా నాయకుడు తుంబూరు దయాకర్ రెడ్డి, మధిర మున్సిపాలిటీ విప్ గా కోనా ధనికుమార్, వైరా మున్సిపాలిటీ విప్ గా వైరా శాసనసభ సభ్యుడు మాలోత్ రాందాస్ నాయక్, కల్లూరు మున్సిపాలిటీ విప్ గా జిల్లా నాయకుడు పొంగులేటి ప్రసాదరెడ్డి, సత్తుపల్లి మున్సిపాలిటీ విప్ గా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు మట్టా రాగమయి లను నియమించారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



