గ్రీన్‌ చానల్‌ ద్వారా పరిహారం

పోక్సో కేసు బాధితులకు ప్రభుత్వ సహాయ సహకారాలు
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్‌, జులై 5: లైంగిక నేరాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ అనే అంశంపై జరుగుతున్న సదస్సులో ఆమె ప్రసంగించారు. లైంగిక దాడులు రిపోర్టు కాగానే నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టామని, 90 శాతం కేసుల్లో నిందితులకు కఠినమైన జైలు శిక్ష పడేలా చేశామని, పోక్సో బాధితులు ఆఫీసులో చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తుందని, వారికి గ్రీన్‌ ఛానల్‌ ద్వారా పరిహారం అందించే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. లైంగిక దాడులకు సంబంధించి అసలు మూలాలను కనిపెట్టి వాటిని నియంత్రించే చర్యలు చేపట్టామన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల వల్లే ఎక్కువగా దాడులు జరుగుతున్నట్టు పోలీసు విచారణలో తేలిందని, అందుకే మత్తు పదార్థాలను కట్టడి చేసేందుకు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నదని ఆమె వివరించారు. పోలీస్‌ శాఖలో ప్రత్యేకంగా నార్కోటిక్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేశామని, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగాన్ని, రవాణాను అణచివేస్తున్నామని చెప్పారు. దీంతోపాటు చిన్న వయసు నుంచి పిల్లలకు గుడ్‌ టచ్‌.. బాడ్‌ టచ్‌ మీద అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా, మహిళా స్వయం సహాయక బృందాల సహకారంతో కిశోర బాలికలు, కౌమార బాలికలు అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. తెలంగాణలో సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ ద్వారా బలమైన మహిళా సంఘటితశక్తి ఉందని, మహిళా ఆర్మీని సిద్ధం చేసి గ్రామాల్లో వేధింపులు, దాడుల పట్ల అప్రమత్తంగా ఉండేలా చేస్తున్నామని మంత్రి వివరించారు. ఇందిరా మహిళా శక్తి విధానంలో చిన్నారులు, మహిళల సంరక్షణను ఎజెండాగా చేర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. న్యాయాధీశులు, పోలీసు ఉన్నతాధికారులు బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలని, బాధితులకు న్యాయం అందించడంలో మానవతతో వ్యవహరించాలని కోరారు. నిందితులను శిక్షించడంతోపాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పిల్లలు దేవుళ్ళతో సమానం, వారి మీద అఘాయిత్యాలు జరగటం దారుణమంటూ మహిళలు, పిల్లలు సగర్వంగా, స్వేచ్ఛగా తలెత్తుకొని తిరిగే వాతావరణం ఏర్పడాలని అన్నారు. అందుకోసం నిందితులకి కఠిన శిక్ష పడేలాగా ప్రభుత్వం, పోలీసులు, న్యాయాధికారులు అందరూ కలిసి పనిచేయాలి, బాధితులకు ఒక కుటుంబంలా మనమంతా అండగా నిలవాలని సూచించారు. న్యాయ కోవిదులు, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలు, రిజిస్ట్రార్లు, పోలీసు ఉన్నతాధికారులలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *