ఉద్యమకారుల సంక్షేమ అధ్యయన కమిటీ ఏర్పాటు!

– సారథిగా ఉద్యమ నాయకుడు కప్పాటి నియామకం
– 30 అంశాలపై అధ్యయన కమిటీలను ప్రకటించిన కవిత

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9: తెలంగాణ జాగృతిని ప్రాంతీయ పార్టీగా తీర్చిదిద్దే దిశగా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక అడుగులు వేస్తున్నారు. ప్రజల సమస్యలను లోతుగా అధ్యయనం చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు సుమారు 30 అంశాలతో కూడిన ప్రత్యేక అధ్యయన కమిటీలను ఆమె ప్రకటించారు. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన ఉద్యమకారుల సంక్షేమ అధ్యయన కమిటీ సారథ్య బాధ్యతలను తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఉద్యమ నాయకుడు కప్పాటి పాండురంగారెడ్డికి అప్పగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలకు తెగించి పోరాడిన వేలాదిమంది ఉద్యమకారుల ప్రస్తుత స్థితిగతులపై ఈ కమిటీ సమగ్ర అధ్యయనం చేయనుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నెరవేరని హామీలు, ఉద్యమకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక ఇబ్బందులను గుర్తించి నివేదిక ఇవ్వడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం. పాండురంగారెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీలో కీలక సభ్యులుగా ననావత్ రాజేష్ నాయక్ (ములుగు జిల్లా), బండారు శ్రీనివాస్ గౌడ్ (పెద్దపల్లి జిల్లా), సాలం వీరేందర్ (మేడ్చల్ జిల్లా) నియమితులయ్యారు.

భవిష్యత్ మేనిఫెస్టోకు పునాది

ఈ అధ్యయన కమిటీలు ఇచ్చే నివేదికలే తెలంగాణ జాగృతి రాబోయే రాజకీయ పార్టీ మేనిఫెస్టోకు దిశానిర్దేశం చేయనున్నాయి. మలిదశ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ స్థాపన వరకు, స్వరాష్ట్రం సిద్ధించే వరకు అలుపెరుగని పోరాటం చేసిన పాండురంగారెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

త్యాగాలకు గుర్తింపు దక్కాలి: పాండురంగారెడ్డి

తెలంగాణ కోసం నిస్వార్థంగా పనిచేసిన ఎంతోమంది ఉద్యమకారులు నేడు ఇబ్బందుల్లో ఉన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారికి అండగా నిలవడమే కవిత ఆశయం. క్షేత్రస్థాయిలో పర్యటించి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వారికి న్యాయం జరిగేలా సమగ్ర నివేదికను రూపొందిస్తాం అని పాండురంగారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి రాజ‌కీయ‌ పార్టీగా రూపుదిద్దుకుంటున్న తరుణంలో నేరుగా ఉద్యమకారుల సమస్యలపై కమిటీ వేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *