palle nidra: దూది వెంకటాపురంలో కలెక్టర్‌ పల్లె నిద్ర

– సమస్యలు విన్నవించుకున్న గ్రామస్తులు
– పరిష్కారానికి హామీ ఇచ్చిన కలెక్టర్‌ హనుమంతరావు

రాజాపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 6: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట(Rajapeta) మండలంలోని దూది వెంకటాపురంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌(district collector) హనుమంతరావు బుధవారం రాత్రి పల్లె నిద్ర చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, హౌసింగ్‌, సివిల్‌ సప్లయిస్‌, వైద్య, జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ, శిశు సంక్షేమ, విద్యుత్‌, రోడ్లు, పంచాయతీ, లీడ్‌ బ్యాంక్‌, మిషన్‌ భగీరథ, ఎక్సైజ్‌, వ్యవసాయ, పశు వైద్య, మత్స్యశాఖల అధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజ, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా వైద్యాధికారి మనోహర్‌, జిల్లా పంచాయతీ అధికారి సునంద, వివిధ శాఖల జిల్లా అధికారులు గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మహిళలతో కలెక్టర్‌ స్వయంగా మాట్లడారు. లబ్ధిదారులందరికీ రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల్లు, సన్న బియ్యం వంటి పథకాలు అంతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో గ్రామస్థులు పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామానికి ఉదయం, సాయంత్రం బస్‌ సౌకర్యం లేదనడంతో వెంటనే గుట్ట డిపో డీఎంకి ఫోన్‌ చేసి బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. గ్రామంలో పీర్ల కొట్టం వద్ద తుప్పు పట్టిన విద్యుత్‌ స్తంభంతో వర్షం వచ్చినప్పుడు దారి వెంట వెళ్లే వారికి షాక్‌ కొడుతోందని తెలిపారు. వెంటనే ఆ సమస్య పరిశీలించి సిమెంటు స్తంభం వేయాలని విద్యుత్‌ డీఈకి చెప్పారు. గ్రామంలో మొత్తం 24 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని కలెక్టర్‌ గ్రామస్తులకు తెలిపారు. గ్రామంలో విద్యుత్‌ సమస్య ఉందని చెప్పడంతో మీ గ్రామానికి కొత్త విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ కూడా మంజూరైందని, త్వరలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య శంకుస్థాపన చేస్తారని తెలిపారు. గ్రామంలో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు తెలుపడంతో పరిష్కరిస్తానని చెప్పారు. గ్రామంలో కొత్తగా 33 రేషన్‌ కార్డులు వచ్చాయని, మొత్తంగా గ్రామస్థులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో వాష్‌ రూం సరిగా లేవని చెప్పడంతో కొత్త వాటిని నిర్మిస్తామని చెప్పారు. గ్రామానికి వెటర్నరీ సబ్‌ సెంటర్‌ లేక పశువులకు రోగాలు వచ్చినప్పుడు చికిత్స కోసం దూరం వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు తెలుపగా కొత్త సబ్‌ సెంటర్‌ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానని కలెక్టర్‌ చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *