తెలంగాణలో చలి పంజా..

-గణనీయంగా పెరిగిన చలి తీవ్రత
-సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తగ్గాయి. రానున్న నాలుగు రోజులు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్పంగా 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ట‌‘ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై దృశ్యత తగ్గి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్‌ జిల్లా పెంబి మండలం చింతగూడకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు గంగారెడ్డి చలి తీవ్రతకు బలవ్వడం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా వచ్చే నాలుగు రోజులు (డిసెంబర్‌ 10, 11, 12, 13) చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట‌‘ ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఈనెల 16 వరకు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. ముఖ్యంగా జగిత్యాల, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, వికారాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సిద్ధిపేట, రంగారెడ్డి ఉన్నాయి.ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ నగరంలోనూ చలి తీవ్రత పెరగనుందని, ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 12 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. వృద్ధులు, పిల్లలు తప్పనిసరిగా వెచ్చటి దుస్తులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రాకుండా ఉండాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వెచ్చటి దుస్తులు ధరించాలని, వేడి వేడి భోజనం చేయాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *