– తెల్ల రేషన్ కార్డుల పంపిణీ
– ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు
– ఎస్‌ఎల్‌బీసీ పనుల పునఃప్రారంభానికి కృషి
– ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నల్గొండ, ప్రజాతంత్ర, జులై 2: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ నెల 14న ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నల్లగొండ కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులన్నింటినీ ఈనెల 13వరకు పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నదన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల మంజూరు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యేనాటికి 89.73 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో కేవలం 49 వేల తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారని, అదీ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు లబ్ధిపొందేందుకు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తదుపరి వేసిన చారిత్రకపు అడుగు తెల్ల రేషన్ కార్డుల మంజూరు అని ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు. రాష్ట్ర జనాభాలో 3.10 కోట్ల మందికి అంటే 84 శాతానికి సన్న బియ్యం చేరుతున్నాయన్నారు. సన్న బియ్యం మీద సాలీనా రూ.13 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడిరచారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఎల్‌బిసి పనులను పునః ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో పారదర్శకత పాటించాలని సూచించారు.




