మహిళా పోలీసుల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త దిశానిర్దేశం

రెండు ప్రత్యేక పుస్తకాల ఆవిష్కరణ!

హైదారాబాద్, ప్రజాతంత్ర  :  తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా, వారికి వృత్తిపరంగా అత్యున్నత సౌకర్యాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక అడుగులు వేశారు. శుక్రవారం అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రెండు ముఖ్యమైన పుస్తకాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించిన ‘తెలంగాణ మహిళా పోలీస్ సదస్సు’ ప్రత్యేక సంచికతో పాటు, రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ 2025 వార్షిక పత్రికను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధుల్లో మహిళా పోలీసులు పోషిస్తున్న పాత్రలను కొనియాడారు. పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా పోలీసుల సవాళ్లు, వారి అభివృద్ధికి కావాల్సిన సూచనలను ఒక పుస్తక రూపంలోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్, అవినీతి నిరోధక శాఖ ఇన్-చార్జ్ డైరెక్టర్ , సిఐడి అడిషనల్ డీజీపీ చారుసిన్హా, టీజీసిఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్, ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ స్వాతి లక్రా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మహిళా పోలీసుల నియామకం, శిక్షణ, వారి వృత్తిపరమైన ఎదుగుదల విషయంలో తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి ఫలితాలను పరిశీలించాలని, మన రాష్ట్రంలో మహిళా పోలీసుల నాయకత్వ పటిమను పెంచేందుకు అవసరమైన నూతన విధానాలను రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా మహిళా సిబ్బందికి వృత్తిరీత్యా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక విశ్రాంతి గదులు, శిశు సంరక్షణ కేంద్రాలు, బందోబస్తు సమయాల్లో సంచార మరుగుదొడ్లు మరియు గస్తీ విధులకు అనువుగా ద్విచక్ర వాహనాలను సమకూర్చడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్త్ ముఖ్యమంత్రికి వివరించారు.

శాంతిభద్రతల విభాగంలోనే కాకుండా, సాయుధ బలగాలు మరియు బెటాలియన్లలోనూ మహిళల సంఖ్యను గణనీయంగా పెంచాల్సిన అవసరముందని,సివిల్ పోలీస్ విభాగంలో అమలవుతున్న ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తరహాలోనే ఇతర విభాగాల్లోనూ మహిళా భాగస్వామ్యాన్ని పెంపొందించాలని, పోలీస్ స్టేషన్ల బాధ్యతలను మహిళా అధికారులకు అప్పగించడం ద్వారా పాతకాలపు మూస ధోరణులను చెరిపివేయాలని మహిళా పోలీస్ సదస్సు అభిప్రాయపడిందన్నారు. శిక్షణా కాలం నుండే లింగ సమానత్వం మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేలా సంస్కరణలు తీసుకురావాలని, విధి నిర్వహణలో సౌకర్యవంతంగా ఉండేలా యూనిఫాం ప్రమాణాలను సమీక్షించేందుకు డిజిపి స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నార్త్ జోన్ జాయింట్ కమిషనర్ ఎన్. శ్వేత, సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కె. మూర్తి, ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె. శిల్పవల్లితో పాటు పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్లు ఎన్. వెంకటేశ్వర్లు, పి. మధుకర్ స్వామి, జి. కవిత, కె.ఆర్.కె ప్రసాద్ రావు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *